TSPSC Paper Leakage Issue Latest Update : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్‌కు చెందిన ఆది సాయిబాబా, మాడావత్ శివకుమార్, నాగార్జునసాగర్ నివాసి రమావత్ మహేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన పొన్నం వరుణ్‌లు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ వద్ద ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్రశ్నపత్రం రూ.10లక్షలకు ప్రవీణ్ బేరమాడాడు. అడ్వాన్సుగా ఒక్కొక్కరు అతనికి లక్షన్నర రూపాయలు చెల్లించారు. ఫలితాలు వెల్లడయ్యాక మిగిలిన సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరితో సంబంధాలున్న మరో 10 మంది అనుమానితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో కొందరు సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వీరంతా అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణకు వచ్చింది.
ప్రశ్నపత్రాల లీకేజీలో బయటపడుతున్న కొత్త లింకులు:టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కొనుగోళ్ల వ్యవహారంలో కొత్త లింకులు బయటపడుతున్నాయి. మార్చి 13న ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు లీకేజీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసులో సంబంధాలున్న 8 మందిని తొలుత బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కేసు దర్యాప్తు నగర సిట్‌కు బదిలీ చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ పోలీసులు లీకుతో సంబంధాలున్న ఒక్కో లింకును చేదిస్తూ వస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోనే 15 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌ను రెండుసార్లు పోలీసు కస్టడీకి తీసుకొని విచారించారు. పోలీసులు ఎదుట అమాయకంగా నటిస్తూ వచ్చిన ప్రవీణ్ తెర వెనుక పెద్ద వ్యవహారమే నడిపినట్టు ఆధారాలు సేకరించారు. మీర్‌పేటలోని అతడి నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, కాల్ డేటా, బ్యాంకు ఖాతా ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులను గుర్తించి సిట్ పోలీసులు వారిని అరెస్టు చేస్తూ వస్తున్నారు.