Group One Exam Leakage Case Update : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఇవాళ మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో.. ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి.. ప్రవీణ్‌కి వారు సహకరించారని అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది. మరో పక్క.. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో మరోసారి తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరణకు గురైంది. సిట్ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్ సైన్స్ల్యాబ్కు పంపించారు. ఆ నివేదిక రాగానే అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 37మందితో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మరికొందరు నిందితుల అరెస్టులు పెరిగే అవకాశం ఉందని సిట్ అధికారుల తెలిపారు.
TSPSC Aspirants Arrest Number Today : దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని అధికారులు అంచనావేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడవుతోంది. ఓ అభ్యర్థి రూ.30 లక్షలు చెల్లించి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నాడని అధికారులు గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు వరకు వసూలు చేశాడని అధికారులు తెలిపారు. ఇలా అనేక మంది పెద్ద మొత్తంలో నగదు చెల్లించి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు. ఈ పరీక్షలు రాసిన వారిలో సుమారు రెండు శాతం మినహా మిగతావారంతా నిరుద్యోగులు. దీంతో పాటు తల్లిదండ్రులపై ఆధారపడి.. చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారని విచారణలో అధికారులు గుర్తించారు. అందువల్ల ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని కొంత మంది పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
TSPSC Paper Leak Case Updates : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. ఫోరెన్సిక్ నివేదిక ఏది?