తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC Case: కుటుంబ సభ్యుల కోసమే అడ్డదారిలో ప్రశ్నాపత్రాల కొనుగోలు - టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు అప్​డేట్​

TSPSC Paper Leakage Case: కుమారుడికి సర్కారు కొలువు వస్తుందన్న ఆశతో తండ్రి.. బావను గ్రూప్‌-1 అధికారిగా చూడాలన్న కోరికతో బావమరిది.. భార్య కోసం ఆమె చేసే దందాలోకి భర్త. ఇలా కుటుంబ సంబంధాల్లో ఒకరిపై మరొకరికి ఉండే అనుబంధాల కోసం టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులు తప్పటడుగులు వేశారు. మితిమీరిన స్వార్థం, అభిమానంతో అడ్డదారి తొక్కిన నిందితులు.. లక్షలాది మంది యువతీ, యువకుల ఉద్యోగ లక్ష్యాన్ని నట్టేట ముంచారు.

tspsc
tspsc

By

Published : May 3, 2023, 9:55 AM IST

కుటుంబ సభ్యుల కోసమే అడ్డదారిలో ప్రశ్నాపత్రాల కొనుగోలు

TSPSC Paper Leakage Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో ఇప్పటివరకూ పోలీసులు 20 మందిని నిందితులుగా తేల్చారు. వారిలో 19 మందిని అరెస్ట్‌ చేశారు. మరింత సమాచారం సేకరించేందుకు సిట్‌ కస్టడీకి తీసుకొని విచారించింది. వారిలో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ మినహా మిగిలిన 18 మంది తప్పు చేశామనే అభిప్రాయం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

కుటుంబసభ్యుల జీవితాలు స్థిర పడతాయన్న ఉద్దేశ్యంతోనే ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించినట్టు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో అధికశాతం మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన వారే ఉన్నారు. టీఎస్​పీఎస్సీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాక్యానాయక్‌ తోపాటు మొత్తం 19 మంది అరెస్టయ్యారు. నిందితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా రాజశేఖర్‌రెడ్డి, సురేష్‌, రాజేందర్, రమేశ్‌ ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సర్కారు విభాగాల్లో పనిచేస్తున్నారు.

వారంతా లీకైన ప్రశ్నపత్రాలను కుటుంబ సభ్యుల కోసమే వివిధ మార్గాల్లో దక్కించుకున్నామని చెప్పినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ను రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినా అమాయకుడినంటూ పదేపదే నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు.. ఉద్యోగ భద్రత కోసమే ప్రశ్నపత్రం బహిర్గతం చేసేందుకు సహకరించానని.. రాజశేఖర్‌రెడ్డి అంగీకరించినట్టు సమాచారం.

భార్య కోసం ఒకరు.. కుమారుడి కోసం మరొకరు:పెన్‌డ్రైవ్‌లోకి చేర్చిన 7 ప్రశ్నపత్రాల విషయం తమ నలుగురికే తెలుస్తుందని భావించానని.. పోలీసులు అదుపులోకి తీసుకునేంత వరకూ.. ఆ విషయం బయటకు వస్తుందని ఊహించలేకపోయానని సిట్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సుశ్మిత ఉన్నత చదువులు పూర్తిచేసి.. ప్రముఖ ఐటీ కంపెనీలో కొలువు పొందారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే భద్రత ఉంటుందన్న భావంతో ఆమె భర్త సాయిలౌకిక్‌ కారు అమ్మి.. ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేశారు. కుమారుడు జనార్దన్‌ కోసం తండ్రి మైబయ్య అప్పు చేసి మరీ డాక్యానాయక్‌ చేతిలో రూ. 2 లక్షలు కుమ్మరించాడు.

ఇప్పటివరకు రూ. 30 లక్షల లావాదేవీలు: టీఎస్​పీఎస్సీ నిర్వహించబోయే టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు తొలుత పోలీసులు భావించారు. మార్చి 13న లీకేజ్‌ కేసులో.. 9 మందిని అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు సిట్‌ చేతికి వచ్చాక అసలు విషయం బయటకొచ్చింది. ప్రమేయం ఉన్న ఒక్కొక్కరు అరెస్టవుతూ వచ్చారు. ప్రవీణ్‌కుమార్, రేణుక రాఠోడ్, డాక్యానాయక్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సప్‌ చాటింగ్స్‌ను సాంకేతిక సాయంతో పోలీసులు వెలికితీశారు. వాటి ఆధారంగా గ్రూప్‌1, ఏఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన నిందితులను గుర్తించారు. ఇప్పటివరకి సుమారు రూ.31లక్షల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు.

ప్రశ్నపత్రాల లీకేజి బయటకొచ్చినట్లు తెలియగానే ప్రమేయం ఉన్న కొందరు.. ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు యత్నించారు. మరికొందరు న్యాయవాదుల సలహా కోరినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లినా, పారిపోయినా ఏదో ఒక సమయంలో పోలీసులు తప్పనిసరిగా అరెస్ట్‌ చేస్తారని.. మరిన్ని సెక్షన్లతో కేసు మరింత బలంగా మారుతుందని సన్నిహితులు ఇచ్చిన సమాచారంతో తమ వంతు వచ్చేంత వరకూ స్వస్థలాల్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details