TSPSC పేపర్ లీక్.. ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి? TSPSC Paper Leak Latest Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 11న ప్రశ్నాపత్రాలు బహిర్గతమైనట్టు బేగంబజార్ పోలీసులకు కమిషన్ అసిస్టెంట్ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. 13న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక రాఠోడ్, డాక్యా నాయక్, రాజేశ్వర్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, రాజేందర్నాయక్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు 6 రోజులు కస్టడీకి తీసుకున్నారు.
సిట్ పోలీసులు 9 మందిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపారు. వీరి నుంచి రాబట్టిన సమాచారంతో లీకేజీ దందా కమిషన్ కార్యాలయం కేంద్రంగానే కొనసాగినట్టు అంచనాకు వచ్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో షమీమ్, రమేష్ కుమార్, సురేష్ పేర్లు బయటకు వచ్చాయి. ఈ నెల 22న సిట్ పోలీసు బృందాలు ఈ ముగ్గురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.
వాట్సప్ ద్వారానే చేతులు మారిన ప్రశ్నాపత్రాలు:వీరి ఇళ్ల నుంచి ల్యాప్‌టాప్, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఏ12 రమేష్ కుమార్ ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ప్రవీణ్ కుమార్ ద్వారా రమేష్, రాజశేఖర్ రెడ్డి నుంచి షమీమ్, సురేష్‌కు గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రాలు వాట్సప్ ద్వారా చేరినట్టు వారి వద్ద లభించిన మొబైల్ ఫోన్ల ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఒకరికొకరు వాటిని చేరవేసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యారు.
సాక్ష్యాల సేకరణ:ఈ ముగ్గురి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు 7 రోజులు పోలీసు కస్టడీకి కోరుతూ సిట్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన సాక్షిగా కమిషన్ కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కమిషన్‌లో జూనియర్ అసిస్టెంట్ అనురాజ్, పొరుగు సేవల నుంచి డెవలపర్ హరీశ్‌కుమార్ నుంచి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి.. కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి ప్రశ్నాపత్రాలు కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడలు.., సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించారు.
ఈ నెల 4న కర్మన్‌ఘాట్ ఆర్‌స్క్వేర్ హోటల్ రూమ్ నంబరు 106, 107లో నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, డాక్యా, రాజిరెడ్డి, మరో ఇద్దరి పేరుతో గదులు అద్దెకు తీసుకున్నట్టు ఆధారాలు సేకరించారు. అదే రోజు ఆ హోటల్‌లో బసచేసి మంతనాలు జరిపినట్టు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సిట్ బృందం సేకరించింది. నిందితులు హాల్‌టికెట్లు, మొబైల్ ఫోన్లు, ఓఎంఆర్ షీట్లు, వాట్సప్ గ్రూప్‌లో లభించిన సమాచారాన్ని క్రోడీకరించారు. కమిషన్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, నిందితుల వద్ద లభించిన 5 పెన్‌డ్రైవ్‌లలో దొరికిన ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి:TSPSC పేపర్ లీకేజీ.. నిందితులను మరోసారి కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్
'రాహుల్‌పై వేటు.. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే'.. తప్పుబట్టిన ప్రతిపక్షాలు