TSPSC AE Paper Leakage case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో.. ప్రశ్న పత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారు ఎందురు ఉన్నారనే అంచనా వేయటం సిట్‌కు సవాల్‌గా మారింది. దర్యాప్తులో పోలీసులు సమయస్పూర్తిని ప్రదర్శించారు. గ్రూప్ 1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లను ప్రశ్నించాలనుకున్నారు. టాపర్లను వేర్వేరుగా సిట్ కార్యాలయానికి పిలిపించి మాస్టర్ ప్రశ్న పత్రాలను దగ్గర ఉంచుకొని సమాధానాలు రాబట్టారు. వారి నుంచి వచ్చే జవాబులు, కదలికల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించారు. ఈ ప్రక్రియలో అధికారులు గుర్తించిన అభ్యర్థులు లీకేజ్ వ్యవహారం కేసులో నిందితులయ్యారు.
HOW to SIT Officers Investigation TSPSC Accused : దర్యాప్తులో భాగంగా విచారణకు పిలిచినప్పుడు ఈ టాపర్లు సిట్ పోలీసులను బురిడీ కొట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించారు. తాము తప్పు చేయలేదని నమ్మించేందుకు రకరకాల ఎత్తులు వేశారు. కానీ పోలీసుల ముందు వీరి ఎత్తులు నిలబడలేదు. పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేసి ప్రశ్నపత్రాలు ఎలా చేతులు మారుతూ వచ్చాయనేది గుర్తిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా.. ఏఈ పరీక్షలో టాపర్‌గా ఉన్న ఓ యువకుడిని పోలీసులు ప్రశ్నించి విస్తుపోయారు. లెక్కల్లో సులువైన ప్రశ్న అడిగితే అతడు తెల్లమొహం వేశాడు. 20 ప్రశ్నలు సందిస్తే కనీసం రెండింటికీ కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు.