TSPSC Paper Leakage Case Updates: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌లో నిందితులుగా ఉన్నవారు.. ఒకరికి తెలియకుండా మరొకరు తెరవెనుక బేరసారాలు చేశారని సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలు లీక్ కాగానే నిందితులు తమ పరిచయాల ద్వారా కోచింగ్ కేంద్రాలు, అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు తేలింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు, వారి బంధువులకు రహస్యంగా ప్రశ్నపత్రాలు అందజేశారు.
SIT Investigation In TSPSC Paper Leakage Case: వారంతా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత సాధించారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాలు లీకైన విషయాన్ని కమిషన్ ఉన్నతాధికారులు పసిగట్టలేకపోవడంతో.. తమ గుట్టు బయటపడదనే ధైర్యంతో ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రెండోసారి తమ ఎత్తులు ఫలించటంతో.. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలతో మరింత లాభపడేందుకు సిద్ధమయ్యారు. పేపర్ లీకైనట్టు పోలీసులు కమిషన్‌ను అప్రమత్తం చేయడంతో గుట్టు బయటపడింది.
TSPSC పేపర్ లీకేజీలో ఇప్పటికి 14 మంది అరెస్ట్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. ఏఈ సివిల్ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ కుమార్‌ను సిట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిగ్రీ పూర్తి చేసిన రాజేందర్ కుమార్.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడులో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్‌గా పని చేసేవాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. డాక్యా నాయక్, తిరుపతయ్య పరిచయం అయ్యారు.