TSPSC Paper Leak SIT Remand Report : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు 19 మందిని సాక్ష్యులుగా చేర్చారు. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితో పాటు అదే కార్యాలయానికి చెందిన మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. వీళ్లలో ప్రవీణ్ వద్ద జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన అనురాజ్తో పాటు.. టీఎస్టీఎస్ తరఫున టీఎస్‌పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి సహోద్యోగిగా పని చేస్తున్న హరీశ్‌కుమార్‌ను సాక్ష్యులుగా చేర్చారు.
కర్మన్‌ఘాట్‌లోని ఆర్ స్క్పేర్ లాడ్జ్ యజమాని, ఇద్దరు సిబ్బందిని సాక్ష్యులుగా చేర్చారు. ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ లాడ్జ్‌లో నీలేశ్, గోపాల్ నాయక్‌తో పాటు డాక్యా నాయక్ బస చేశారు. ప్రవీణ్ లీక్ చేసిన ప్రశ్నాపత్రం ఆధారంగా సమాధానాలు చదువుకొని.. 5వ తేదీన నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. లాడ్జిలో ఉన్న సీసీ దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఏఎస్వో షమీమ్, రమేష్, సురేష్లను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ ముగ్గురినీ వారం రోజుల కస్టడీ ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీకి చెందిన నలుగురు ఉద్యోగులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 13వ తేదీన ప్రవీణ్, రాజశేఖర్‌ను అరెస్ట్ చేయగా.. షమీమ్, రమేష్‌లను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.