TSPSC Online Recruitment Tests: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో ప్రకంపనలు రేగుతున్న వేళ.. భారీ ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆన్‌లైన్ విధానమే సరైందిగా భావిస్తోంది. ఇప్పటికే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్, ఇతర పీఎస్సీలతో పాటు విద్యాసంస్థల్లో ప్రవేశ కమిటీలు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
TSPSC Exercise on Conducting Online Exams: ఏటా ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో.. లక్షలాది మంది అభ్యర్థులకు ఒకే రోజున పరీక్షలు నిర్వహించడం ఆషామాషీ కాదు. ఈ క్రమంలో ఆయా సంస్థలు అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్ ఎగ్జామ్‌లు నిర్వహిస్తున్నాయి. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజులపాటు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి.
50 వేల మంది ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం: తాజాగా ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు వినియోగించుకుంటే 50 వేల మంది వరకు ఆన్‌లైన్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని అంచనా. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ పరీక్షలపై అభ్యర్థుల్లో అవగాహన ఉంది.
దీంతో టీఎస్పీఎస్సీ నిర్వహించే వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఏఎమ్వీఐ, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఏఈ తదితర పరీక్షలకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనుంది. గ్రూపు సర్వీసుల ఉద్యోగాలకు ఈ విధానం అమలు చేయాలని గతంలోనే భావించినప్పటికీ, నిరుద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని పాత విధానాన్నే కొనసాగించింది. ప్రస్తుతం ఓఎమ్ఆర్ పద్ధతి అవలంభించినప్పటికీ, భవిష్యత్తులో నార్మలైజేషన్ ఆధారితంగా విడతల వారీగా పరీక్షలు పూర్తి చేసేలా నిబంధనలు సవరించనుంది.