TSPSC Intends to Reschedule Exams: ప్రశ్నాపత్రాల లీకేజీతో పలు పరీక్షలను రీషెడ్యూలు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశం ఉంది.. వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. అభ్యర్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యే పరీక్షలను వీలైనంత త్వరగా ముగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాల తయారీ: ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షల తేదీలూ రీ షెడ్యూలయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి నెలాఖరులోగా తేదీలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాలు సిద్ధమవుతాయి. రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనుంది.
కనీసం 3 నెలల సమయం అవసరం: 40,000 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పోటీ పరీక్షలను కమిషన్ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకు తక్కువగా ఉంటే కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు పెడుతోంది. కానీ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించేందుకు.. కనీసం 3 నెలల సమయం అవసరం. ప్రశ్నాపత్రం సిద్ధం చేసి, ముద్రించి.. పరీక్ష కేంద్రాల వరకు సరఫరా చేయడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలోనే కొన్ని పోటీ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ముగిసింది.