త్వరలో గ్రూప్-2, 3 ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్-2, 3 పరిధిలోకి తేవడంతో వాటి సంఖ్య పెరగనుంది. గ్రూప్-2 పరిధిలోకి దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు రావడంతో.. ఆ ప్రకటన కింద మొత్తం 783 ఖాళీలు ఉండే అవకాశాలున్నట్లు తెలిసింది. గ్రూప్-3లో పెరగనున్న పోస్టులపై కమిషన్ కార్యాచరణ పూర్తి చేసింది.
గ్రూప్స్ ఉద్యోగాలకు.. ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు సమాచారం. వాటితో పాటు టీఎస్పీఎస్సీకి అప్పగించిన మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్ సన్నద్ధమవుతోంది. నెలాఖరులోగా అటవీ బీట్ అధికారులు, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు ప్రకటనలివ్వాలని టీఎస్పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది.
నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ నిర్ణయం:గ్రూప్-2 కింద 663, గ్రూప్-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ.. 2022 ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీచేసింది. వాటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్-2, గ్రూప్-3 స్థాయి కలిగిన మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. వాటన్నిటిని కలిపి నోటిఫికేషన్లు జారీచేసి భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఎస్సీ సంక్షేమశాఖలో-17, ఎస్సీ-9, బీసీ-17 సహాయ సంక్షేమాధికారి పోస్టులు గ్రూప్-2 పరిధిలోకి వచ్చాయి.