తెలంగాణ

telangana

ETV Bharat / state

సమగ్ర సన్నద్ధతే కీలకం.. సిలబస్‌ ప్రకారం అధ్యయనం చేస్తేనే ఉద్యోగం - టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి

Ghanta Chakrapani on Group-1 Jobs: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాలను గొప్ప అవకాశంగా తీసుకుని.. పోటీ పరీక్షలకు ఉద్యోగార్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధం కావాలని టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి సూచించారు. తెలంగాణ తొలి గ్రూప్‌-1లో 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండటం జీవితకాల అవకాశమని, వాటికి ఆత్మవిశ్వాసంతో పోటీ పడాలని పేర్కొన్నారు. మూస పద్ధతిలో కాకుండా సిలబస్‌ ప్రకారం ఆయా అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు.

సమగ్ర సన్నద్ధతే కీలకం.. సిలబస్‌ ప్రకారం అధ్యయనం చేస్తేనే ఉద్యోగం
సమగ్ర సన్నద్ధతే కీలకం.. సిలబస్‌ ప్రకారం అధ్యయనం చేస్తేనే ఉద్యోగం

By

Published : Apr 11, 2022, 5:23 AM IST

Ghanta Chakrapani on Group-1 Jobs: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాలను గొప్ప అవకాశంగా తీసుకుని.. పోటీ పరీక్షలకు ఉద్యోగార్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధం కావాలని టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్‌, అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగం డీన్‌, సెంటర్‌ ఫర్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (సీఎస్‌టీడీ) డైరెక్టర్‌ ఘంటా చక్రపాణి సూచించారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక సన్నద్ధమవుదామన్న ఆలోచన నుంచి బయటపడి.. పరీక్ష ఎప్పుడు పెట్టినా రాసేలా సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ తొలి గ్రూప్‌-1లో 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండటం జీవితకాల అవకాశమని, వాటికి ఆత్మవిశ్వాసంతో పోటీ పడాలని పేర్కొన్నారు. మూస పద్ధతిలో కాకుండా సిలబస్‌ ప్రకారం ఆయా అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. ఆంగ్లంలో వెనుకబడి ఉన్నామని ఎవరూ ఆందోళన చెందకూడదని, పదో తరగతి స్థాయి పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. వర్తమాన వ్యవహారాలపై అవగాహనకు పత్రికలను చదవాలని.. ప్రతి అంశాన్ని చదివి, ముఖ్యమైన అంశాలపై నోట్స్‌ రాసుకోవాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దక్షిణ ప్రాంతీయ పరిధిలో తెలంగాణ వాటా పెరిగేలా జాతీయస్థాయి పరీక్షలూ రాయాలని సూచించారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఘంటా చక్రపాణి ‘ఈనాడు’తో మాట్లాడారు.

పత్రికలలో ఏం చదవాలి?

గ్రూప్స్‌తో పాటు అన్ని ఉద్యోగాలకు సిలబస్‌ ఇప్పటికే ఖరారైంది. తెలంగాణ వచ్చాక 36 మంది నిపుణుల కమిటీతో శాస్త్రబద్ధమైన సిలబస్‌ రూపొందించాం. అది తరచూ మారదు. కరెంట్‌ అఫైర్స్‌లో సంఘటనలు, విషయాలు మారుతుంటాయి. రాష్ట్రంలో ఉన్న పథకాలపై ప్రశ్నలుంటాయి. సిలబస్‌ ప్రకారం క్షుణ్నంగా చదవాలి. జనరల్‌ స్టడీస్‌కు ప్రత్యేకమైన సిలబస్‌ ఉండదు. ప్రజలకు అందుబాటులోని సమాచారం మేరకు ప్రశ్నలుంటాయి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం కనీసం రెండు ప్రామాణికమైన పత్రికలను సమగ్రంగా చదవాలి. సమాచారం కోసం కాకుండా విజ్ఞానం, తదుపరి సమాచారం తెలుసుకోవాలి. విశ్లేషణలు, సంపాదకీయాలు ముఖ్యం. ప్రతి మౌలిక సమాచారం గుర్తుపెట్టుకునేలా నోట్స్‌ రాసుకోవాలి.

గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎలా సన్నద్ధమవ్వాలి?

గ్రూప్‌-1కు పోటీ ఎక్కువగా ఉంటుంది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 503 ఉద్యోగాలు రానున్నాయి. ఆర్డీవో, డీఎస్పీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వీటికి స్పష్టమైన ప్రణాళికతో సన్నద్ధమైతే.. జాతీయస్థాయి పరీక్షలనూ రాయవచ్చు. ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకోనివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కోచింగ్‌ సెంటర్లు సలహాలు, సూచనలు, మార్గదర్శనం కోసమే. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాల్లోనూ వీటిని పొందవచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పరీక్షలపై సరైన అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు.‘నాకు తెలిసిందే విజ్ఞానం’ అన్న భావన నుంచి బయటకు రావాలి. పరీక్షను ఎందుకు పెడుతున్నారు? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి జవాబులు ఎలా రాయాలో తెలుసుకోవాలి. చాలామంది అభ్యర్థులు కనీస అవగాహన లేకుండా.. తమకు తోచినట్లుగా సన్నద్ధమవుతారు. తీరా పరీక్షలో చదువుకున్న అంశంపై ప్రశ్నలు రాలేదని బాధపడతారు. సమగ్ర అధ్యయన ప్రణాళిక లేకపోవడంతోనే ఇలా జరుగుతుంది. సిలబస్‌ను, పరీక్ష సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గత ఆరు నెలలు, ఏడాది కాలంలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చదవాలి. సరైన మెటీరియల్‌ని ఎంపిక చేసుకోవాలి. నియామక సంస్థలు తెలుగు అకాడమీ, యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు ముద్రించే పుస్తకాల్లోని, పత్రికల్లోని సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటాయి. శిక్షణ తీసుకోవాలని భావిస్తే.. ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌ చరిత్ర, బోధకుల విద్యార్హతలు, అనుభవం, పరిశోధనలు తదితర అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో ఎలాంటి మార్పులు రావాలి

ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిళ్లలో శిక్షణ కార్యక్రమాల్లో మార్పులు జరగాలి. పేరున్న నిపుణులతో బోధన చేయించాలి. అన్ని స్టడీ సర్కిళ్లను ఆన్‌లైన్లో అనుసంధానించి.. పాఠాలను వీడియో రూపంలో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తద్వారా శిక్షణకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు, ప్రైవేట్‌లో రూ.లక్షలు భరించలేని వారికి అందుబాటులోకి వస్తాయి. స్టడీ సర్కిళ్లతో పాటు యూనివర్సిటీలు, యూనివర్సిటీ కళాశాలల్లో ప్రభుత్వమే శిక్షణ కేంద్రాలు నెలకొల్పాలి. అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో పెట్టాలి. టీ-శాట్‌ ఛానెళ్లు అందుబాటులో ఉన్నందున నిపుణులతో బోధన చేయించి.. ఆ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టాలి.

ఇదీ చదవండి:Nagarjuna Sagar Project: నిధులు లేక నీరసం.. నిరీక్షణలో సాగరం

ABOUT THE AUTHOR

...view details