TSPSC Exam Paper Leak Latest Updates: టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యప్తు ముమ్మరం చేశారు. అసలు లీక్ ఏ విధంగా జరిగిందనే విషయంపై అరా తీసిన పోలీసులు.. కేసుతో సంబంధం ఉన్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. కమిషన్‌లో ప్రశ్నాపత్రం నేరుగా లీక్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో.. కార్యాలయంలో అత్యంత రహస్యంగా నిర్వహించే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్లలోని ప్రశ్నల సాఫ్ట్ కాపీ సమాచారాన్ని దొంగలించిట్లు పోలీసులు గుర్తించారు.
టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్న ఏఎస్ఓ ప్రవీణ్, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌తో కలిసి ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. అయితే టీఎస్పీఎస్సీలో ఇటీవల కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సమాచారం.. కార్యదర్శి సంబంధిత సెక్షన్ వద్ద ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన సమయంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న.. టీసీఎస్ పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరించినట్లు అనుమానిస్తున్నారు. కంప్యూటర్లు ఆప్‌గ్రేడ్ చేసినప్పుడు ప్రయత్నం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ప్రవీణ్‌కు ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.
కీలక అంశాలు వెలుగులోకి: కేసు దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్‌కు పరిచయం ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కోసమే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. అమెతో ప్రవీణ్‌కు పాత పరిచయం ఉన్నట్లు గుర్తించారు. ఆమె పలు మార్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి కార్యాలయంలో ప్రవీణ్‌తో పాటు ఎక్కువసేపు కూర్చున్నట్లు తెలిసింది. సాధారణంగా ఆ కార్యాలయంలో అనుమతి లేనిదే ఇతరులను అనుమతించరు.
ఆమె చెప్పిన డీల్ కోసం.. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్:ఎవరిని కలవాలో ముందుగా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి.. ఆ అధికారి నుంచి అనుమతి తీసుకుంటారు. వచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ మహిళ.. కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ను కలిసేందుకు తరుచూ రావడం.. కార్యాలయం నుంచి పోలీసులకు కార్యదర్శి పీఏగా ప్రవీణ్ అనుమతిని ఇవ్వడంతో ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఆమె చెప్పిన డీల్ కోసం ప్రవీణ్.. పేపర్‌ను లీక్ చేశారన్న వివరాలు పోలీసులు సేకరించారు. అది కూడా ఎక్కువ మందికి ప్రశ్నలు లీక్ చేస్తే.. చేసిన తప్పులు బయటపడుతాయన్న ఉద్దేశంతో వారు పకడ్బందీగా వ్యవహరించారని తెలిపారు.
బేరసారాలు నడిపిన ఉపాధ్యాయురాలు: ముఖ్యంగా ఉపాధ్యాయురాలు .. తన సోదరుడి కోసం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నాపత్రం కావాలంటూ ప్రవీణ్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. ప్రశ్నాపత్రం దొరికే అవకాశం ఉండటంతో ఆమె పరీక్ష రాసేందుకు సిద్ధమైన అభ్యర్థి.. ఒక గ్రామ సర్పంచి కుమారుడితో బేరసారాలు నడిపింది. నలుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసింది. ఇందులో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.