TSPSC Town Planning Supervising Officer Paper Leak: పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధిచిన పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం లేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రవీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చిన 13మందిని అదుపులోకి పోలీసులు విచారిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌తో పాటుగా పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దించారు. హ్యాకింగ్ జరిగిందని టీఎస్‌పీఎస్సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో... సైబర్ క్రైం పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ విచారణలో పలు విషయాలు పోలీసులకు తెలిసినట్లు సమాచారం.
TSPSC Veterinary Assistant Surgeon Paper Leak: ముగ్గురు దళారులతో కలిసి పేపర్ లీకేజీకి కుట్రపన్నాడని ఇందుకోసం 10 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు ప్రాథమికంగా తెలిసింది. పోలీసులు అప్రమత్తం చేయడంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షల్ని నిలిపి వేసింది. పేపర్ లీక్ అయిందని ఓ అభ్యర్థి పోలీసులకు సమాచారం ఇవ్వగా బేగంబజార్ పోలీసులు టీఎస్‌పీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనిఖీ చేసిన అధికారులు వెంటనే పరీక్షను నిలిపివేశారు.