తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC Chairman: 'సన్నద్ధతకు సమయమిస్తాం.. గడువులోగా నియామకాలను పూర్తి చేస్తాం' - ts news

TSPSC Chairman: "టీఎస్‌పీఎస్సీ నియామకాలపై  సామాజిక, ఇతర మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. వీరిలో అభ్యర్థులు ఉంటే పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తాం. అభ్యర్థుల సంఖ్య 30 వేల వరకు ఉంటే.. ఆయా ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తాం. అంతకు మించి అభ్యర్థులు ఉండి..ఆన్‌లైన్‌లో నిర్వహణకు సదుపాయాలు ఉంటే సందర్భం మేరకు నిర్ణయం తీసుకుంటాం." -బి.జనార్దన్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

TSPSC Chairman: 'సన్నద్ధతకు సమయమిస్తాం.. గడువులోగా నియామకాలను పూర్తి చేస్తాం'
TSPSC Chairman: 'సన్నద్ధతకు సమయమిస్తాం.. గడువులోగా నియామకాలను పూర్తి చేస్తాం'

By

Published : Mar 12, 2022, 4:24 AM IST

TSPSC Chairman: న్యాయవివాదాలు తలెత్తకుండా.. నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు, భర్తీ ప్రక్రియపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, అనవసర ఆందోళనలతో పరీక్షల సమయంలో ఇబ్బందులకు గురికావొద్దని అభ్యర్థులకు సూచించారు. నోటిఫికేషన్ల జారీ నుంచి రాతపరీక్షకు మధ్య సన్నద్ధతకు తగిన సమయం ఉంటుందన్నారు. జవాబు పత్రంలో బబ్లింగ్‌లో పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని కోరారు. నియామకాలపై అభ్యర్థుల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని స్పష్టంచేశారు. జిల్లా స్థాయిలో ఏజెన్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ప్రతివారం సమీక్ష నిర్వహించి త్వరగా పోస్టింగులు ఇస్తామన్నారు. పరీక్షల్లో అభ్యర్థి ప్రతిభ మేరకు ఎంపికలు ఉంటాయని.. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. జనార్దన్‌రెడ్డి శుక్రవారం ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేశారు.

అందరి దృష్టీ తెలంగాణ తొలి గ్రూప్‌-1పై ఉంది. ఈ పరీక్ష నిర్వహణ ఎలా ఉంటుంది?
గ్రూప్‌-1 సిలబస్‌ను 2015లో కమిషన్‌ ఖరారు చేసింది. ప్రస్తుతం అందులో మార్పులు ఉండవు. నోటిఫికేషన్‌ సమయంలోనే దరఖాస్తు చివరి తేదీతో పాటు ప్రిలిమినరీ, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించే సమయాన్ని సివిల్స్‌ తరహాలో ముందుగానే ప్రకటిస్తాం. ప్రధాన పరీక్షలకు ఈ-ప్రశ్నపత్రాన్ని అందిస్తాం. పరీక్ష కేంద్రంలో కంప్యూటర్‌ ముందు కూర్చుని ప్రత్యేక పాస్‌వర్డ్‌తో ప్రశ్నపత్రాన్ని ఓపెన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి ముందు, పరీక్ష ముగిసిన తర్వాత.. ఆ ప్రశ్నపత్రం కనిపించదు.

ఎంపిక ప్రక్రియలో కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొస్తున్నారా?
అభ్యర్థుల జవాబు పత్రాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. పరీక్ష జరిగిన మరుసటి రోజునే ఆ ప్రశ్నపత్రం ప్రాథమిక కీ వెలువరించి, నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఏమైనా అభ్యంతరాలుంటే.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిపుణుల కమిటీకి సిఫార్సుచేసి, కమిటీ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. ఇంటర్వ్యూలు పూర్తి పారదర్శకంగా నిర్వహించే వ్యవస్థను ఇప్పటికే కమిషన్‌ సిద్ధం చేసింది.

గతంలో జారీచేసిన నోటిఫికేషన్లఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి కదా..?
ఉద్యోగ ప్రకటనలకు అర్హతలు ఖరారు చేయడంలో సంబంధిత విభాగాలు చేసిన పొరపాట్లతో న్యాయవివాదాలు తలెత్తాయి. ఉదాహరణకు పీఈటీ పోస్టులకు డిప్లొమా, బీపీఈడీ అర్హతలపై స్పష్టత లేకపోవడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 600 పోస్టుల ఫలితాలు నిలిచిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొన్ని కేటగిరీల పోస్టులదీ ఇదే సమస్య. ఇవి మరో 600 వరకు ఉన్నాయి. ఏఎన్‌ఎం పోస్టులు(238), పీవీ నరసింహారావు విశ్వవిద్యాలయం (126) పోస్టుల ఫలితాలు వెల్లడించేందుకు తుది ప్రక్రియ కొనసాగుతోంది.

న్యాయవివాదాలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
రోస్టర్‌ తయారీ, రిజర్వేషన్ల ఖరారు, విద్యార్హతలు నిర్ణయించడంలో సంబంధిత విభాగాల పొరపాట్లతో న్యాయవివాదాలు తలెత్తాయి. భవిష్యత్తులో ఈ తరహా వివాదాల్లేకుండా జాగ్రత్త పడతాం. ఈ మేరకు కమిషన్‌ తరఫున ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశాం. ఒకవేళ ఏమైనా పొరపాట్లు దొర్లితే వెంటనే సరిచేసుకుంటాం. ఎవరైనా కావాలని న్యాయవివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే.. కోర్టులలో అఫిడవిట్లు దాఖలు చేసి ఉద్యోగాల భర్తీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటాం.

రాష్ట్రపతి నూతన మార్గదర్శకాల నేపథ్యంలో ఓటీఆర్‌లో వ్యక్తిగత వివరాలను ఎలా సరిచేస్తారు?
కమిషన్‌ వద్ద ప్రస్తుతం 25 లక్షల మంది ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఓటీఆర్‌(వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌)లో వివరాలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, అదనపు అర్హతలు, ఆదాయ వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఇస్తాం. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వివరాలు అప్‌డేట్‌ చేసుకునేలా ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేశాం. పది జిల్లాలు 33 జిల్లాలుగా మారడం, స్థానికత నిర్వచనం మారడంతో పలు మార్పులు వస్తాయి. తొలుతే ఈ అవకాశం ఇవ్వడంతో ఏ జిల్లా, జోన్‌, మల్టీజోన్‌ పరిధిలోకి వస్తామో అభ్యర్థులకు తెలుస్తుంది. ఆ మేరకు ఉద్యోగాలకు పోటీపడేలా అవకాశం కలుగుతుంది. ఓటీఆర్‌లో వివరాల అప్‌డేషన్‌కు నిరంతరం అవకాశం ఉంటుంది.

ఉద్యోగార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి..?
నిరుద్యోగ అభ్యర్థులు పక్కా ప్రణాళికతో చదవడంతోపాటు ఆరోగ్యమూ ముఖ్యమే. నేను సివిల్స్‌ రాసేప్పుడు సైకాలజీ పరీక్ష ముందు రోజు రాత్రి తినలేదు. రాత్రి 11 గంటల సమయంలో మెస్‌ మూసేశారు. కడుపులో మంట.. తినేందుకు ఆహారం దొరకలేదు. రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం మెస్‌లోకి వెళ్లి కాయగూరలు తినేసి వెళ్లాను. ఉదయం పరీక్ష బాగా రాసినా, ఆందోళనతో సాయంత్రం పరీక్ష సరిగా రాయలేదు. అభ్యర్థులు ఆరోగ్యంపైనా శ్రద్ధపెట్టాలి.

సీఎం ప్రకటన అనంతరం నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.. ఎప్పటిలోగా వస్తాయి?
ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు కొంత కసరత్తు జరుగుతుంది. ఆర్థికశాఖ పోస్టులను గుర్తిస్తూ జీవో ఇస్తుంది. విభాగాధిపతులు ఖాళీలకు రోస్టర్‌ ప్రకారం రిజర్వేషన్లు, విద్యార్హతలు, స్పోర్ట్స్‌, దివ్యాంగుల కోటా వివరాలతో నోటిఫికేషన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. దీనికి 7-30 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రతిపాదనలు నియామక సంస్థలకు అందిన వెంటనే కమిషన్‌ అధికారులు, విభాగాధిపతులు రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలను సరిచూస్తారు. ఈ ప్రక్రియ పూర్తికి వారం పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటన జారీచేసి దరఖాస్తుల స్వీకరణకు 30-45 రోజుల సమయం ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిశాక రాత పరీక్షకు 2-3 నెలల సమయం అవసరం. ఓఎంఆర్‌ జవాబు పత్రాల పరిశీలన, మూల్యాంకనానికి మరో నెల రోజులు కావాలి. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, తుది ఫలితాలకు 1-2 నెలలు పడుతుంది. నోటిఫికేషన్లు.. పరీక్షలకు మధ్య అభ్యర్థులు సన్నద్ధమయ్యేంత సమయం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా మార్పులు రానున్నాయా?
దరఖాస్తులో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌ అడుగుతున్నారు. అందుకే దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేస్తున్నాం. దరఖాస్తు పూర్తిచేసిన తర్వాత అభ్యర్థులు ప్రివ్యూ సమయంలో.. నమోదు చేసిన వివరాలు సరిచూసుకోవడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇక నుంచి ఆ సమస్యను అధిగమించేందుకు ప్రివ్యూ తర్వాత సబ్మిట్‌ ఆప్షన్‌ ఇచ్చాక మూడు నిమిషాల వరకు సబ్మిట్‌ కాకుంటే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాం. ఆ లోగా ఏమైనా పొరపాట్లు ఉంటే అభ్యర్థులు ఎడిట్‌ ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుతో పాటు డిగ్రీ, కులధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేసేందుకు ఆప్షనల్‌ కింద అవకాశమిస్తున్నాం. తద్వారా సర్టిఫికెట్ల పరిశీలనలో వెసులుబాటు కలుగుతుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details