Telangana Group 4 exam on July 1st : రాష్ట్రంలో 8 వేల180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 40 వేల గదుల్లో అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లను చేసింది. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ, జిల్లా ఎస్పీలతో కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది.
రెండు పేపర్లు.. :గ్రూప్-4 పరీక్ష విధానంలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ప్రతి పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. అందువలన అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచింది.
ఇవీ సూచనలు :అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో డబుల్ బబ్లింగ్ చేయకుండా టీఎస్పీఎస్సీ సూచనలను ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థులకు చేరవేసింది. వాటితో పాటు బబ్లింగ్ లోపాలను వివరాలతో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇది అభ్యర్థులు గమనించాలని సూచించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అధికారిని కమిషన్ నియమించింది. ఆ అధికారి పర్యవేక్షణలో.. అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు హాల్‌టికెట్, అందులోని పేరు, ఫొటో గుర్తింపు కార్డు, మిగతా వివరాలను పరిశీలించి అనుమతించనున్నారు.