TSPSC Appeal Hearing on Group 1 Cancel: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిలతో కూడిన ధర్మాసనం ముందు కమిషన్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. కానీ అందుకు ధర్మాసనం నిరాకరిస్తూ మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది.
Group 1 prelims exam cancelled in Telangana :అయితే పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్న టీఎస్‌పీఎస్సీ.. బయోమెట్రిక్ అమలు చేయకపోవడం వల్ల ఎవరికీ నష్టం కలగలేదని స్పష్టం చేసింది. అలా కలిగినట్లు రుజువు చేయకపోయినా పరీక్షలను రద్దు చేయాలన్న పిటిషన్‌ను సింగిల్ జడ్జి అనుమతిస్తూ పరీక్షను రద్దు చేశారని కమిషన్ గుర్తు చేసింది. ఈ పిటిషన్‌ను 2 లక్షల 33 వేల 506 మందికి వర్తింపజేయడం సరికాదని అభిప్రాయపడింది. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా తీసుకున్న చర్యలను కమిషన్ వివరించింది. అయితే బయోమెట్రిక్ విధానం అమలు చేయని కారణంగా ఒకరి బదులు మరొకరు రాసిన ఉదంతం ఒక్కటి కూడా లేదని తెలిపింది. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగ సంస్థ అని తెలిపిన కమిషన్.. దీనికి కొన్ని అధికారాలుంటాయని వివరించింది.
Telangana HC Hearing on TSPSC Appeal Over Group 1 :పరిస్థితులకు అనుకూలంగా పరీక్షల నిర్వహణకు మెరుగైన పద్ధతులను నిర్ణయించే అధికారం ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని హైకోర్టుకు సమర్పించిన అప్పీల్లో టీఎస్పీఎస్సీ పేర్కొంది. కేవలం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయలేదన్న కారణంగా సింగిల్ జడ్జి పరీక్షను రద్దు చేశారని తెలిపింది. బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోయినా.. ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా కమిషన్ అన్ని చర్యలూ తీసుకుందని వెల్లడించింది. బయోమెట్రిక్ కొందరికి తీసుకుని, మరికొందరికి తీసుకోలేదన్నది వివాదం కాదన్న టీఎస్‌పీఎస్సీ.. అభ్యర్థుల తనిఖీకి అన్ని పరీక్ష కేంద్రాల్లో ఒకే రకమైన విధానాన్ని అనుసరించామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.