తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPLRB Instuctions: ప్రాథమిక రాతపరీక్షలో 30 శాతం మార్కులొస్తే సరి! - TSPLRB Instuctions to police aspirants

TSPLRB Instuctions: రాష్ట్రంలో పోలీసు కొలువులకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం తెలంగాణ పోలీసు నియామక మండలి పలు సూచనలు చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్షకు మూడు రోజుల్లోనే 40 వేల దరఖాస్తులొచ్చాయి.

Police
Police

By

Published : May 6, 2022, 5:34 AM IST

TSPLRB Instuctions: రాష్ట్రంలో భారీసంఖ్యలో పోలీసుఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైంది. ప్రాథమిక రాతపరీక్షకు మూడు రోజుల్లోనే 40 వేల దరఖాస్తులొచ్చాయి. మొత్తంగా 7 లక్షల దరఖాస్తులొస్తాయని అంచనా అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం తెలంగాణ పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌, అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాస్‌రావు పలుసూచనలు చేశారు.

అందరికీ 30 శాతం మార్కులే అర్హత:ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించి.. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 35 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు అర్హతగా పరిగణించేవారు. ఈసారి అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా నిర్ణయించడం కలిసొచ్చే అంశం.

ఊహించి రాస్తే నష్టమే:ప్రాథమిక రాతపరీక్షలో సాధించే మార్కులు తుది ఫలితాల్లో పరిగణనలోకి రావు. ఇందులో తెలియని సమాధానాలను ఊహించి రాస్తే నష్టమే. 60 సరైన సమాధానాలను గుర్తించగలిగితే అర్హత సాధించొచ్చు. అయిదు తప్పు సమాధానాలకు ఒక నెగెటివ్‌ మార్కు ఉంటుంది. కనుక తెలియని వాటిని వదిలేయడమే ఉత్తమం. తుది రాతపరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులుండవు.

ఛాతీ కొలతల్లేవు.. హైజంప్‌ ఉండదు:గతంలో పురుషులకు ఎత్తుతో పాటు ఛాతీ కొలతలు పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి ఛాతీ కొలతల్లేవు. నిర్ణీత ఎత్తు ఉంటే సరిపోతుంది. గతంలో పురుషులకు 5, మహిళలకు 3 ఈవెంట్లుండేవి. పురుషులకు 100 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెం తీసేశాం. వీటికి బదులుగా 1600మీటర్ల పరుగుపందెం ఉంటుంది. మహిళలకు 100 మీటర్లకు బదులు 800 మీటర్ల పరుగు పెట్టాం. ఈసారి హైజంప్‌ ఉండదు.

లోపాలకు ఆస్కారమే లేని పరిజ్ఞానం:శారీరక పరీక్షల్లో లోపాలకు ఆస్కారం లేని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దేశంలోనే మరెక్కడా లేని డిజిటల్‌ థియోడలైట్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ, బయోమెట్రిక్‌.. తదితర సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తున్నాం. మైదానంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది.

ఏడేళ్లలో ఎక్కువ కాలమున్నదే స్థానిక జిల్లా:కొన్ని ప్రైవేటు పాఠశాలలు మూతపడిన కారణంగా అభ్యర్థులకు 1-7 తరగతుల సర్టిఫికెట్లు దొరకడం లేదు. అన్ని సర్టిఫికెట్లు లభించకపోతే ఏడేళ్లలో ఎక్కువ కాలం చదివిన పాఠశాల ఆధారంగానే స్థానిక జిల్లాను గుర్తిస్తాం. సర్టిఫికెట్లు లేకపోతే తహసీల్దారు కార్యాలయం నుంచి నివాస ధ్రువీకరణపత్రం తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపత్రాలనూ తహసీల్దారు కార్యాలయం నుంచే తీసుకోవాలి. నియామకాల్లో ఎక్కువ సంఖ్య గల కానిస్టేబుల్‌ పోస్టులు జిల్లా కేడర్‌వే. స్థానిక జిల్లావాసులకే 95 శాతం రిజర్వేషన్‌ కావడంతో స్థానికత చాలా కీలకం. ఇప్పటి నుంచే ధ్రువీకరణపత్రాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలి.

ధ్రువీకరణపత్రాలు తక్షణం అవసరం లేదు:పాఠశాలల నుంచి ధ్రువీకరణపత్రాల సేకరణలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక రాతపరీక్ష ఉన్నందున తక్షణం ధ్రువీకరణపత్రాల్ని అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో ఫొటో, అభ్యర్థి సంతకం మాత్రం ఒక ఫైల్‌లో పంపిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండోసారి సమగ్ర వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ధ్రువీకరణపత్రాలు అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే ధ్రువీకరణపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 1 నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఎంపికకు అర్హులు. దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లినా ఎడిట్‌ ఆప్షన్‌ లేదనే భయం అక్కర్లేదు. తుది పరిశీలన సమయంలో నామమాత్రపు రుసుంతో వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తాం.

మూడింటిలోనూ అర్హత సాధించాల్సిందే:పరుగుపందెంలో అర్హత సాధించేందుకు ఒకేసారి అవకాశముంటుంది. షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌కు మాత్రం మూడు అవకాశాలుంటాయి. ఈ 3 ఈవెంట్లలోనూ అర్హత సాధించాలి. అభ్యర్థులు మైదానంలోకి అడుగుపెట్టాక తొలుత పరుగుపందెం పూర్తిచేయాల్సి ఉంటుంది. తర్వాతే కొలతలు, లాంగ్‌జంప్‌ పరీక్షలుంటాయి.

కిందటిసారి మాదిరే ఫీజు:మిగతా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వమే వ్యయం భరిస్తుంది. కానీ పోలీసు నియామకాలు అలా కాదు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అనేది సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ బోర్డు. 95 శాతం నిధుల్ని బోర్డే సమకూర్చుకుంటుంది. మిగిలిన ఉద్యోగాల్లో లేని రీతిలో ఫిజికల్‌ ఈవెంట్ల నిర్వహణ ఉండటంతో ఆర్థిక భారం ఎక్కువ. అందుకే దరఖాస్తు రుసుం 2018లో మాదిరిగానే రూ.800గా నిర్ణయించాం.

ఒక మొబైల్‌ నంబరు ఒక అభ్యర్థికే..:అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్‌ నంబరును యూనిక్‌ మొబైల్‌ నంబరుగా పరిగణిస్తారు. ఒక మొబైల్‌ నంబరును ఒక అభ్యర్థి మాత్రమే వినియోగించాలి. తప్పనిసరిగా మెయిల్‌ఐడీ వివరాలు ఇవ్వాలి. ఓటీపీలు సెల్‌ఫోన్‌తో పాటు మెయిల్‌ఐడీకి వస్తాయి. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వీటికే అప్‌డేట్స్‌ అందుతుంటాయి.

ఇదీ చూడండి:

పోలీసు ఉద్యోగాలకూ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details