TSNAB Focus on Drugs Control in Telangana :మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటైన టీఎస్‌న్యాబ్, పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందున్న సవాళ్లు, యువత- సమాజంపై డ్రగ్స్ చూపుతున్న చెడు ప్రభావాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎదుట వివరించినట్లు సంస్థ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మారేందుకు చేపట్టాల్సిన చర్యలను, లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Sandeep Shandilya on Drugs Control in Telangana :టీఎస్‌న్యాబ్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు సందీప్ శాండిల్య (TSNAB Director Sandeep Shandilya) వివరించారు. ఎలాంటి నిబంధనలు ఉండకుండా, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ వలే ప్రధాన సంస్థగా మార్చాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇతర సంస్థలతో పాటుగా టీఎస్‌న్యాబ్‌లో పనిచేసేవారికి వేతన పెంపు, పదోన్నతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంను కోరానని, దీనిపై ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సందీప్ శాండిల్య తెలిపారు.
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం.. నిరోధానికి మరింత పకడ్బందీ చర్యలు
Anti Drug Committees in Telangana : టీఎస్‌న్యాబ్ (TS NAB) ప్రధానంగా విద్యాసంస్థలు, ఐటీ, చిత్రపరిశ్రమ, బార్స్, పబ్స్, రేవ్ పార్టీలు, రిసార్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని సందీప్ శాండిల్య తెలిపారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, పోలీసులు చూడకపోతే ఇంకెవరు చూస్తారని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాదకద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు కనీసం ఐదుగురితో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలుగా (Anti Drug Committees in Telangana) ఏర్పడాలని సందీప్ శాండిల్య సూచించారు.
విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందే : ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా, నియంత్రణపై దృష్టితో పాటు అవగాహన కల్పించాలని సందీప్ శాండిల్య అన్నారు . ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లు, సరఫరా చేసినట్లు తెలిస్తే వెంటనే, ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు. విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాల సరఫరాపై, యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని సందీప్ శాండిల్య తేల్చి చెప్పారు.