TSLPRB New Decision: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈసారి కీలకమైన అంశాల(ఈవెంట్స్) నిర్వహణలో వడబోత విధానం అమలు చేయబోతోంది. గతంలోలా అన్నింటిలో పాల్గొనే అవకాశమిచ్చేందుకు బదులు ఈసారి వడబోతను అనుసరించబోతోంది. ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 వేదికల్లో ఈవెంట్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
వీటిలో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ, ఇందులో గట్టెక్కలేకపోతే ఇక వెనుదిరగాల్సిందే. తదుపరి పోటీలకు అవకాశం లభించదు. గతంలో ఇలా ఉండేది కాదు.. అప్పట్లో తొలుత అభ్యర్థుల శారీరక కొలతల్ని తీసుకునేవారు. పురుష అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు.. మహిళా అభ్యర్థుల ఎత్తును పరిగణనలోకి తీసుకునేవారు. అవి నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే తదుపరి ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతించేవారు.
కొలతల్లో అర్హత పొందిన పురుష అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 800 మీటర్ల పరుగు పోటీల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఈ క్రమంలో మొదటి పోటీలో అర్హత సాధించకపోయినా తదుపరి పోటీలకు అనుమతించేవారు. చివరకు అయిదు ఈవెంట్లలో ఏవేని మూడింటిలో ఉత్తీర్ణులైతే సరిపోయేది. అలాగే మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ అంశాల్లో పాల్గొనేవారు. ఏవేని రెండింటిలో అర్హత సాధిస్తే ఉత్తీర్ణులైనట్లు పరిగణించేవారు.