Constable Si Preliminary Exam result: ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో.. కీలకమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన వారంతా వాటిని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఈనెల 27 నుంచి నవంబరు 10 వరకు గడువు ఉంది.
‘పార్ట్-2’గా పిలిచే ఈ ప్రక్రియలో.. అవసరమైన అన్ని ధ్రువీకరణపత్రాలను (సర్టిఫికెట్లు) అప్‌లోడ్ చేస్తేనే అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధిస్తారు. వివిధ పోస్టులకు గాను దాదాపు 2.69 లక్షల మంది ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించడంతో రోజుకు సగటున 18,000 మంది వెబ్‌సైట్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. అభ్యర్థులు గడువు చివరివరకు ఆగకుండా ముందుగానే ధ్రువీకరణపత్రాలను సమర్పించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండలి వర్గాలు సూచిస్తున్నాయి.
స్థానికత కీలకాంశం:రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నియామక ప్రక్రియ జరుగుతుండటంతో స్థానికత అంశం కీలకంగా మారింది. ఈమేరకు తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్ జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా కేడర్లలో స్థానికులకే 95% ఉద్యోగావకాశాలుండటంతో అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకుగాను 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే స్థానికేతరులుగానే పరిగణించనున్నారు. అప్పుడు కేవలం 5% నాన్‌లోకల్ కోటాలోనే పోటీపడాల్సి వస్తుంది. కుల ధ్రువీకరణపత్రాలు సమర్పించడంలో విఫలమైతే జనరల్ కేటగిరీగానే పరిగణనలోకి తీసుకుంటారు.
సమర్పించాల్సిన ధ్రువీకరణపత్రాలివే:
- 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ/కాండక్ట్ సర్టిఫికెట్లు. గుర్తింపు పొందిన పాఠశాలలో చదవకుంటే తహశీల్దారు జారీచేసిన నివాస ధ్రువీకరణపత్రం.
2. పుట్టినతేదీ నిర్ధారణకు పదో తరగతి మెమో.
3.ఎస్సై పోస్టులకు డిగ్రీ, కానిస్టేబుల్ స్థాయికి ఇంటర్ మెమో.