Tslprb on fake news: రాష్ట్రంలో ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయంటూ.. వస్తున్న వార్తలను నమ్మొద్దని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక పరీక్ష కీని నిపుణులతో తయారు చేయిస్తున్నామని అన్నారు. త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రశ్నాపత్రంలో తప్పులు వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని చెప్పారు. అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్సైట్లో వచ్చిన వార్తలు లేదా.. సంబంధిత అధికారులు జారీ చేసిన ప్రెస్ నోట్లను మాత్రమే నమ్మాలని శ్రీనివాసరావు సూచించారు. వ్యక్తిగత సందేశాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోవద్దని తెలిపారు. అలాంటి వార్తలేమైనా వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని శ్రీనివాసరావు తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. పోలీస్ సివిల్ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు మరో 38 పట్టణాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.