కరోనా కారణంగా ఆన్లైన్లో పాఠాలనుఅందిస్తున్న టీశాట్.. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించేందుకు పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొంది. విద్యార్థులకు జూన్ 15 నుంచి ప్రత్యేక తరహాలో ఆన్లైన్ బోధనలు అందనున్నాయి. టీశాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వారా సోమవారం నుంచి జరిగే ప్రత్యేక బోధనలను సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి వివరించారు. నిపుణ ఛానల్లో సాంఘిక గురుకుల సంక్షేమ శాఖ ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండో విడత ప్రారంభమవుతుందని చెప్పారు.
నిపుణ ఛానల్లో..
ఐఐటీ, జేఈఈ విద్యార్థుల కోసం యుప్ టీవి సౌజన్యంతో ప్రతి రోజు 12 గంటల ప్రసారాలుంటాయని అన్నారు. నిపుణ ఛానల్లో ఉదయం ఐదు నుంచి 10 గంటల వరకు నీట్, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మెయిన్స్ సబ్జెక్టులపై ప్రసారాలు, విద్య ఛానళ్లలో మరుసటి రోజు ఇవే సమయాల్లో పునః ప్రసారం జరుగుతాయని శైలేశ్ రెడ్డి తెలిపారు.
అనేక రికార్డులు నెలకొల్పిన
చిన్నవయసులోనే గణిత బోధనల్లో అనేక రికార్డులు నెలకొల్పిన ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికులేటర్ నీలకంఠ భానుప్రకాష్ ప్రత్యేక పాఠ్యాంశాలను ఆరు నుంచి పదోతరగతి విద్యార్థుల కోసం ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎక్స్ఫ్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థతో ఒప్పందం కుదర్చుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు సులువుగా గణితం నేర్చుకునేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో రూపొందించే 700 ఎపిసోడ్స్ 350 గంటల కంటెంట్ త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని శైలేశ్ రెడ్డి చెప్పారు. బీబీసీతో కుదిరన ఒప్పందం ప్రకారం ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి అరగంట పాటు ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నామని అన్నారు. టీశాట్ నెట్వర్క్ సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, టీశాట్ యాప్‌లలోనూ ప్రసారాలు ఉంటాయని తెలిపారు. బధిరులకు ఉపయోగపడేలా ప్రత్యేక కరెంట్ అఫైర్స్ కార్యక్రమాన్ని అరగంట పాటు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి :తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు