సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు చేయించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సత్వరమే పరిష్కరించాలని కోరింది. తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని.. 2016 అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు జరిపించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జస్టిస్ రమణకు వినతిపత్రం సమర్పించారు. రాజ్‌భవన్‌లో జస్టిస్ రమణను టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, నాయకులు ఆర్.శారద, పి.మాణిక్ రెడ్డి, ఆవారి శ్రీనివాస్ కలిశారు. ముందుగా సీజేఐగా నియమితులైనందుకు సీజేఐకు శుబాకాంక్షలు తెలియజేశారు.
కనీస వేతనాలు లేవు
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సమగ్ర శిక్ష పథకంలో 25 వేల మంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1,50,000 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారని యూటీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. వీరికి ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయటం లేదని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర మొదటి వేతన సవరణ సంఘం నివేదికలో రెగ్యులర్ ఉద్యోగుల మూల వేతనాలు 60 శాతానికి పైగా పెరగగా, కాంట్రాక్టు ఉద్యోగులకు 30శాతం పెంచేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీంతో రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో అంతరం మరింతగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీజేఐ జోక్యం చేసుకొని సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా.. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో అమలయ్యేలా చూడాలని కోరారు.