కరోనా బారి నుంచి కార్మికులను రక్షించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. 40 మందికి పైగా మహమ్మారి ధాటికి బలయ్యారని ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆయన సదస్సు నిర్వహించారు. సమస్యల సాధనకు.. బస్ భవన్ ముందు బైఠాయించి శాంతియుత నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు.
రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజిరెడ్డి అన్నారు. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో స్పెషల్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని కోరారు.