తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్గో నిర్వాకం: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. - parcel of guavas in TSRTC cargo

TSRTC Cargo Services: టీఎస్​ఆర్టీసీ ఆదాయాన్ని పరుగులు పెట్టించడానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కార్గో పార్సిల్​ సర్వీస్​లపై కొందరు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. భద్రాద్రి కొత్తగూడెంలో 51 కేజీలతో జామ కాయలు పార్సిల్​ చేస్తే.. హైదరాబాద్​ ఉప్పల్​ వచ్చేసరికి అవి కాస్తా 27 కేజీలుగా మారిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

Guavas
Guavas

By

Published : Mar 22, 2023, 12:24 PM IST

TSRTC Cargo Services: కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన టీఎస్​ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి తీసుకొచ్చిన ఆర్టీసీ కార్గో.. వినియోగదారులకు మంచి సేవలు అందిస్తోంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ప్రత్యేక చొరవ తీసుకొని దీనిని మరింత విస్తరించారు. వాటితో పాటుగా ప్రయాణికులకు తక్కువ డబ్బులకే తాగు నీరు సీసాలు, ఏసీ బస్సులు, హైదరాబాద్​ లాంటి నగరాల్లో తక్కువ ఛార్జీలతో నగరం చుట్టేసేలా స్పెషల్​ ఆఫర్​లు తీసుకొచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు, ఆర్టీసీలో నూతన విధానాలు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ కొందరు ఆర్టీసీ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుతో ఆ సంస్థ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

TSRTC Parcel Services: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బస్సు స్టేషన్​లో మురళి అనే వ్యక్తి ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జామకాయల పార్సిల్‌ (కన్‌సైన్‌మెంట్‌ నంబరు 6164826) బుక్‌ చేశారు. హైదరాబాద్​లోని ఉప్పల్‌ సర్కిల్‌లో టీఎస్‌ఆర్టీసీ పార్సిల్‌ బుకింగ్‌ సెంటర్​లో వాటిని తీసుకోడానికి అనిల్​ అనే మరో వ్యక్తి వెళ్లారు. పార్సిల్​ చేసిన వ్యక్తి 51 కేజీలు పంపించామని చెప్పగా.. అనిల్​కు అవి తక్కువగా అనిపించాయి. దీంతో అధికారులను తూకం వేయమన్నారు.

తూకం వేస్తే 27 కేజీల బరువు చూపిస్తోంది. అదేంటి 51 కేజీలు పంపితే.. 27 కేజీలుండటం ఏంటి అని అనిల్​ అధికారులను నిలదీశారు. తమకేం తెలియదని పార్సిల్‌ తీసుకెళ్లండి అంటూ అధికారుల నుంచి సమాధానం వచ్చింది. దీంతో ఇల్లెందు బస్సు స్టేషన్‌లోని కార్గో సిబ్బందిని ప్రశ్నించారు. వారు కూడా సరిగానే తూచి అందుకు తగ్గ డబ్బులు తీసుకుని పంపించామని.. తీసుకున్నచోటే అడగండి అనే సమాధానం ఇచ్చారు. కార్గో సర్వీసులకు సంబంధించి కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. విచారిస్తామని తెలిపారు.

ఆర్టీసీ కార్గో బిజినెస్‌ హెడ్‌ సంతోశ్​​ను సంప్రదించగా.. దీనిపై తమకు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నామని.. వినియోగదారుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ నెల 18న జామ కాయల పార్సిల్‌ బుక్‌ చేస్తే.. మరుసటి రోజు అంటే మార్చి 19వ తేదీ ఉదయానికి రావాలి. కానీ 20వ తేదీకి వచ్చింది. ఒక్కరోజు ఆలస్యం అవ్వడంతో వచ్చిన జామకాయల్లో కొన్ని పాడైనట్లు వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇల్లందులో బుక్​ చేసినప్పుడు చూపిన బిల్లు

ABOUT THE AUTHOR

...view details