ts rtc sabharimala spl service : ప్రయాణీకుల అవసరాలే ఆర్టీసీకి ఆదాయ వనరు. ఈసూత్రాన్ని అన్ని విధాల అమలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ .. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాణీకుల మన్ననలతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు ఆఫర్లు తీసుకొచ్చి ప్రజలకు చేరువవుతున్న టీఎస్ ఆర్టీసీ... తాజాగా శబరిమల భక్తుల యాత్రపై దృష్టి పెట్టింది. తెలంగాణ ఆర్టీసీ.. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది.
కార్తికమాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తుల యాత్రలు మొదవుతాయి. రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో స్వామిమాలధారులు శబరిమలకు వెళ్తుంటారు. ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని ఈసారి ఆర్టీసీ వినియోగించుకోవాలనుకుంటోంది. శబరిమలకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అంతే కాకుండా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
ఐదుగురికి ఫ్రీ
శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్ 1 డిపో తరఫున ట్విట్టర్‌లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. శబరికి బుక్ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మూడు ఫుల్ టిక్కెట్లు, రెండు హాఫ్ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడంలేదని ఆర్టీసీ వెల్లడించింది. అయితే వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించరు. బస్సులో ఖాళీగా ఉన్న స్థలంలో వారు కూర్చోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణంగా అద్దెకు ఇచ్చే బస్సుల్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఫుల్ టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. కానీ.. ఆర్టీసీలో ఈసారి ఐదుగురికి ఉచితంగా పంపించాలని నిర్ణయించారు.
ఛార్జీలు ఇలా ఉన్నాయి...
- శబరిమలకు 36 సీట్లు ఉన్న సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటర్ రూ.48.96
- 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.47.20
- 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్ కు రూ.56.64
- 49 సీట్లు ఉన్న ఎక్స్ ప్రెస్ బస్ లకు కిలోమీటర్ కు రూ.52.43లు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.