MLA's Court Cases in Elections Period : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై హైకోర్టు తీర్పు.. అదే తరహా వివాదం ఎన్నికల వివాదాలపై ఉత్కంఠను రేకెత్తించాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోర్టుల్లో కేసుల విచారణ నేతల్లో టెన్షన్ పెంచుతోంది. హైకోర్టులో మరో 28 మంది ప్రజాప్రతినిధుల ఎన్నికలపై వివాదాలు విచారణ దశలో ఉన్నాయి. ఎన్నికల పిటిషన్లను 12 మంది న్యాయమూర్తులను విభజించటంతో.. కొంతకాలంగా విచారణలో వేగం పుంజుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్, ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ ఎన్నికపై పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా వాటిలో అధికంగా ఎన్నికల అఫిడవిట్లకి చెందిన వివాదాలే. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం అభ్యర్థి తనతోపాటు.. కుటుంబ సభ్యుల వివరాలు సమర్పించాలి. ఐతే క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలను తప్పుగా చూపారని.. ఆ కారణంగా వారి ఎన్నికను కొట్టివేయాలని ఆయా పిటిషన్లలో పేర్కొన్నారు. ఎక్కువ పిటిషన్లలో.. రెండో స్థానంలో ఉన్న సమీప ప్రత్యర్థులే పిటిషనర్లుగా ఉన్నారు.
Karimnagar MLA Court Case : కరీంనగర్ ఎమ్మెల్యేగాగంగులకమలాకర్ ఎన్నికపై.. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్‌పై విచారణకు ముగ్గురూ ఇటీవల హాజరై వాంగ్మూలాలిచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కొప్పుల ఈశ్వర్ కేసులో ఈవీఎంలు భద్రపరిచిన గది తాళం దొరకక పోవడం వివాదమైంది. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూం తాళం పగలగొట్టి వివరాలు సమర్పించారు. రాఘవేంద్రరాజు అనే వ్యక్తి తనపై వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. సోమవారం నుంచి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల వివాదంపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలన్న ఎంపీ బీబీ పాటిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.