అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లపై అనేక రకాల వ్యాఖ్యలు వస్తున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. చిన్న గుడ్లు అంటేనే అంగన్వాడీవి అంటున్నారని మంత్రి తెలిపారు. నాణ్యమైన గుడ్లనే సరఫరా చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.
నెలకు 30 గుడ్లు!
అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాపై అధికారులు, గుత్తేదారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్.. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్నారన్నారు. నెలకు 30 గుడ్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు.
గ్రీన్ఛానల్లో ఆహార బిల్లులు!
దేశవ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్నట్లే తెలంగాణలోనూ ఉందన్న మంత్రి.. దీన్ని అధిగమించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. మరో ఐదారు లక్షల మందికి గుడ్లు ఇచ్చే ప్రతిపాదన ఉందన్నారు. బిల్లుల విషయంలో ఆలస్యం కాకుండా చూస్తామని.. పిల్లలు, మహిళల ఆరోగ్యం కోసం ఇచ్చే ఆహార బిల్లులను గ్రీన్ఛానల్లో పెట్టే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
మంత్రిగా కాకుండా తల్లిగా..
పిల్లలకు సరఫరా చేసే గుడ్ల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మంత్రిగా కాకుండా తల్లిగా... పిల్లల ఆహారంలో చిన్న పొరపాటునూ సహించబోనని వ్యాఖ్యానించారు.
గుడ్లపైన అంగన్వాడీ పేరుతో స్టాంపింగ్ వేయించే ఆలోచన చేస్తున్నామన్న ఆశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. ప్రతి గుడ్డు కనీసం 50 గ్రాములు ఉండాలని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సరఫరాదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల ఆరోగ్యం కోసం సరఫరా చేసే గుడ్డు పథకాన్ని విజయవంతం చేస్తామని గుడ్ల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ధర్మారావు అన్నారు.
ఇవీచూడండి:కిలో పాలు రూ.33... ఆ కథేంటి..?