హైదరాబాద్ నగరంలో విమాన, రక్షణ రంగ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చడం సంతోకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో 'ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టం ఫెసిలిటీ' (Integrated Defence System Facility)కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో వెమ్ టెక్నాలజీస్ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకొంది.
రాష్ట్రంలో వెమ్ టెక్నాలజీస్ సంస్థ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు కేటీఆర్. ఇక్కడ తయారవుతున్న వాటిని యూఎస్, యూరప్, ఇజ్రాయెల్‌కూ ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక విదేశీ సంస్థల పెట్టుబడులు రావడమే కాదు.. వాటికి తగ్గట్లుగా లక్షల కోట్ల విలువైన ఆర్డర్లూ వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. జహీరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
'లార్జ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా... తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన వెమ్ టెక్నాలజీస్‌కు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 2 వేలకుపైగా ఉద్యోగాలు లభిస్తాయి. తెలంగాణమీద మీరు విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టం విలువను మరింత పెంచారు. రక్షణరంగానికి చెందిన అత్యున్నతమైన నిపుణులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ రంగం అభివృద్ధికి మేము పూర్తి మద్దతు ఇస్తాం.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి