తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక' - TS IPASS 5th ANNIVERSARY Celebrations

రాష్ట్ర పారిశ్రామికీకరణలో టీఎస్​-ఐపాస్ చట్టం నూతన అధ్యాయమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్-ఐపాస్ అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఐదో వార్షికోత్సవం నిర్వహించారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందని గుర్తుచేసిన మంత్రి....  కేటాయించిన భూములను పరిశ్రమలు సద్వినియోగం చేసుకోకపోతే  వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు.

TS IPASS 5th ANNIVERSARY Celebrations at Shilpakalavedika in Hyderabad
'టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక'

By

Published : Dec 5, 2019, 5:03 AM IST

Updated : Dec 5, 2019, 7:36 AM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానమైన టీఎస్ -ఐపాస్‌ చట్టం ఐదేళ్లు పూర్తిచేసుకుంది. 2014 డిసెంబర్‌ 4న టీఎస్​-చట్టం అమల్లోకి వచ్చింది. ఐదేళ్లలో 11 వేల 600 పైగా పరిశ్రమలకు అనుమతులు, లక్షా 73 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 13లక్షల మందికిపైగా ఉద్యోగావకాశాలు లభించాయి. అనుమతులు పొందిన వాటిలో 8 వేల 964 పరిశ్రమలు ప్రారంభం కాగా మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి.

కేసీఆర్ మానస పత్రిక

హైదరాబాద్‌ శిల్పకళా వేదికగా నిర్వహించిన ఐదో వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. టీఎస్ ఐపాస్‌ను కేసీఆర్ మానస పుత్రికగా అభివర్ణించారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందన్నారు. వివిధ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే 12వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

భూములను వెనక్కి తీసుకుంటాం

పర్యావరణ హితంగానే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని.. వైట్, బ్లూ, గ్రీన్, పింక్ రెవల్యూషన్లలో రాష్ట్రం సత్తా చాటాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రెడ్, ఆరెంజ్ పరిశ్రమలను బాహ్యవలయ రహదారికి బయటే ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను సద్వినియోగం చేసుకోకపోతే వెనక్కి తీసుకుంటామని తేల్చి చెప్పారు. పనిచేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించేలా కేంద్రం ధోరణి లేదని కేటీఆర్​ ఆరోపించారు.

కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది

రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పారిశ్రామీకీకరణలో, పెట్టుబడుల ఆకర్షణలో, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోన్నా.. కేంద్రం రాజకీయ కక్ష సాధింపుతో అభివృద్ధికి సహకరించట్లేదన్నారు. బుల్లెట్ ట్రైన్, డిఫెన్స్​ కారిడార్, ఇండస్ట్రీయల్ కారిడార్ విషయంలో కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు.

హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు చుట్టూ పరిశ్రమల స్థాపన మరింత ఊపందుకోవాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అవకాశాలను పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలన్నారు.

టీఎస్​ ఐపాస్‌ పనితీరుపై పారిశ్రామిక వేత్తలు ప్రశంసలు కురిపించారు. పారిశ్రామిక ప్రగతిలో ముందంజలో ఉన్న జిల్లాలకు మంత్రి కేటీఆర్ పురస్కారాలు ప్రకటించారు. దళిత, గిరిజిన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు 305 కోట్ల రాయితీ మొత్తాన్ని వారికి అందజేశారు.

'టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక'

ఇవీచూడండి: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల

Last Updated : Dec 5, 2019, 7:36 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details