ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
15:56 July 08
ఎంపీ రఘురామ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు.
విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ తరఫున ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గోవింద్ రెడ్డి వాదించారు. నేరాభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కానిస్టేబుల్‌ను సీఆర్పీఎఫ్ సస్పెండ్ చేసిందని వివరించారు. కేసును కొట్టివేయద్దని కోరారు. కేసు నమోదై నాలుగు రోజులే అయినందున.. ప్రస్తుత దశలో ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయలేమని... అవసరమైతే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని రఘురామకృష్ణరాజు, భరత్‌కు సూచిస్తూ పిటిషన్ కొట్టివేసింది.
ఇవీ చూడండి..