TS HighCourt on Republicday Celebrations: గణతంత్ర దినోత్సవం ఎప్పటిలాగే ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. గణతంత్ర ఉత్సవాలు, కవాతును ప్రభుత్వం నిర్వహించడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి కె.శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గతంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో దేశభక్తిని చాటేలా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం.. ఈ ఏడాది విస్మరించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్‌రెడ్డి వాదించారు. సంప్రదాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా గణతంత్ర దినోత్సవాలను ఎందుకు జరపడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ఆంక్షల మేరకు వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు జరపాలని... ఈనెల 23న గవర్నర్‌ను కోరినట్లు ఏజీ వివరించారు. రాజ్‌భవన్‌లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని.. ఉత్సవాల ప్రజలు తిలకించేలా వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై రాష్ట్రాలకు ఈనెల 19న మార్గదర్శకాలు పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.