High Court on Lepakshi Lands: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అక్రమాస్తులకు చెందిన వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 13వ నిందితుడు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. నిందితుడు బి.పి.కుమార్‌బాబు ఈ అభ్యర్థనను చేయగా.. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి ప్రయోజనాలు కల్పించినందున ఆయన కుమారుడు జగన్‌కు చెందిన కంపెనీల్లోకి ముడుపులను మళ్లించడానికి బి.పి.కుమార్‌బాబు కీలకపాత్ర పోషించారన్న సీబీఐ ఆరోపణలను ఈ దశలో తోసిపుచ్చలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఛార్జిషీటు దశలోనే పిటిషనర్‌పై ఛార్జిషీటును రద్దు చేయడం అన్నది సరికాదని, అందువల్ల విచారణను అడ్డుకోడానికి ఈ కోర్టు ఆసక్తి చూపడం లేదన్నారు.