తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనర్‌ ఇష్టపడినా... ఆమెతో శృంగారం అత్యాచారమే...

మైనర్ ఇష్టపడి లైంగికంగా కలిసినా.. అత్యాచారం పరిధిలోకే వస్తుందని హైకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. 15 ఏళ్ల బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించగా... దానికి ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

TS High Court has ruled that sexual intercourse with a minor is a form of rape
మైనర్‌ ఇష్టపడి కలిసినా అత్యాచారమే: హైకోర్టు

By

Published : Apr 1, 2022, 7:13 AM IST

Updated : Apr 1, 2022, 12:06 PM IST

బంధువు చేసిన మోసం కారణంగా వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి ఓ బాలికకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. బాలిక(15)ను ఆమె బంధువు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి బలవంతంగా తన లైంగిక వాంఛను తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. అవాంఛిత గర్భాన్ని తొలగించాలని బాలిక కుటుంబ సభ్యులు నిలోఫర్‌ ఆసుపత్రిని ఆశ్రయించగా.. అందుకు వైద్యులు నిరాకరించారు. చట్టప్రకారం అనుమతులు అవసరమని చెప్పడంతో.. బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. 15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆమె ఇష్టపూర్వకంగానే తన బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా.. అత్యాచారం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. గర్భం కారణంగా మైనర్‌ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని.. శారీరకంగా, మానసికంగానూ ప్రభావం ఉంటుందని పేర్కొంది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవచ్చని తెలిపింది. అయితే దీనికి ముందు బాలికతో మాట్లాడాల్సి ఉందంది. 20 వారాల గర్భంతో కోర్టుకు రావడం ఇబ్బందికరమని.. నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తమ అభిప్రాయం చెప్పాలంది. బాలికతో, ఆమె తల్లితో సూపరింటెండెంట్‌ విడివిడిగా మాట్లాడాలని ఆదేశించింది. అబార్షన్‌ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలను వివరించాలని, ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలని నిలోఫర్‌ ఆసుపత్రి వైద్యులను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆసుపత్రి వైద్యులు... బాలిక గర్భాన్ని తొలగించారు.

నేపథ్యమిదీ..

బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక(15) ఎనిమిదో తరగతి వరకు చదివింది. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెంది, పెళ్లై ఇద్దరు పిల్లలున్న బంధువు(26) వ్యక్తిగత పనుల నిమిత్తం నవంబరు నెలలో వీరి ఇంటికి వచ్చాడు. బాలిక తల్లిని అక్కగా పిలిచే అతడు.. కొద్ది రోజులపాటు ఇక్కడే ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు రోజువారీ పనికి బయటకు వెళ్లగా.. బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. కొద్దిరోజుల తరువాత అతడు ఖమ్మం వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే బాలిక ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని, అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో ఆమె తల్లి తొలుత నిలోఫర్‌ వైద్యులను, అనంతరం హైకోర్టును ఆశ్రయించింది.

ఇదీ చూడండి: గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని.. పురుగుల మందు తాగి ఆత్మహత్య

Last Updated : Apr 1, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details