ఇఫ్లూ(ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో బోధనా సిబ్బంది నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గతేడాది 58 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఇఫ్లూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓబీసీలకు అన్యాయం జరిగేలా నోటిఫికేషన్ ఉందని.. రిజర్వేషన్ నిబంధనలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఇఫ్లూ నియామక ప్రక్రియను నిలిపివేయాలని గతేడాది బీసీ కమిషన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ బీసీ కమిషన్ స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇఫ్లూ హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. యూనివర్సిటీలో నియామకాలను నిలిపివేస్తూ జాతీయ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. కేసు పూర్వాపరాల జోలికి ఇక్కడ వెళ్లడంలేదని తెలిపింది.‘‘ఓబీసీ రిజర్వేషన్ల వివాదంపై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. రిజర్వేషన్ల వివాదంపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చు’’ అని ధర్మాసనం తెలిపింది. నియామకాల్లో అభ్యంతరాలుంటే అభ్యర్థులు సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చని తెలిపింది.
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్...