ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ ముఖాముఖికి... హైకోర్టు అనుమతి నిరాకరించింది. ముఖాముఖికి అనుమతిచ్చేలా ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలన్న ఎన్‌ఎస్‌యూఐ నేతల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఓయూ ఉత్తర్వుల్లో జోక్యం చేసేందుకు నిరాకరించింది. ఓయూ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మానవతరాయ్ సహా మరో ముగ్గురు ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
ఎన్‌ఎస్‌యూఐ నేతలు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు - TS High Court dismisses petition filed by NSUI leaders
![ఎన్‌ఎస్‌యూఐ నేతలు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు High Court dismisses petition filed by NSUI leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15192520-294-15192520-1651677178164.jpg)
18:42 May 04
TS High Court on Rahul OU Tour
రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గతేడాది పాలక మండలి తీర్మానించిందని... ఓయూ తరఫు న్యాయవాది తెలిపారు. పాలక మండలి తీర్మానంపై అభ్యంతరం చెప్పకుండా.... అందుకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడం తగదన్నారు. యూనివర్సిటీలో పరీక్షలు, ఉద్యోగ సంఘాలు ఎన్నికలున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్లు యూనివర్సిటీలో రెగ్యులర్ విద్యార్థులు కాదని.. ఇలాంటి వాటికి అనుమతిస్తే బయటివారు అనుమతి కోరతారన్నారు.
రాహుల్ ముఖాముఖి కేవలం విద్యార్థులను చైతన్య పరిచేందుకేనని ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఠాగూర్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించడం వల్ల ఉద్యోగ సంఘాల ఎన్నికలు, పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు. ఇదే యూనివర్సిటీలో ఫిబ్రవరి 17న జరిగిన సీఎం పుట్టిన రోజు వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారని వివరించారు. భాజపా ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారని గుర్తుచేశారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఓయూ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదీచూడండి: రాహుల్ ఓయూ టూర్... మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ