పాఠశాల విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే ఏమీ చెప్పలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విద్యా సంవత్సరం ఆధారపడి ఉంటుందని వివరించింది. ప్రైవేట్ పాఠశాలల ఆన్లైన్ తరగతులను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. కరోనా తీవ్రత కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంకా విద్యా సంవత్సరం ఖరారు కాలేదని తెలిపింది. అందరికీ అనువైన విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.
కమిటీ ఏర్పాటు
అధ్యయనం చేసేందుకు విద్యా శాఖ అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా ముసాయిదా నివేదిక కూడా సిద్ధమైందని.. నివేదికలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. బడులు తెరిచే వరకు టీవీలు ఆన్లైన్ పద్ధతిలో ప్రత్యామ్నాయ బోధన చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని విద్యా శాఖ తెలిపింది. డిజిటల్ బోధనపై ఈనెల 14న జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మార్గదర్శకాలు జారీ చేసిందని ప్రభుత్వం తెలిపింది.