Projects in Telangana: ప్రాజెక్టులపై నీటిపారుదలశాఖ శీతకన్ను.. వరదలొచ్చినా ఉలుకులేదు!
Projects in Telangana: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తినా.. ప్రభుత్వంలో చలనం రాలేదు. నీటిపారుదల శాఖపై శీతకన్ను ప్రదర్శిస్తోంది. కేవలం ఇంజినీర్ల స్థాయి పోస్టులను మాత్రమే భర్తీ చేస్తూ క్షేత్రస్థాయిలో కీలకమైన సిబ్బంది నియామకాలను గాలికొదిలేస్తోంది. దీంతో ఇంజినీర్లే గేట్ల ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ల అవతారమెత్తాల్సి వస్తోంది.
TS Projects
By
Published : Aug 7, 2022, 7:04 AM IST
Projects in Telangana: ప్రాజెక్టుల నిర్వహణపై నీటిపారుదలశాఖ శీతకన్ను ప్రదర్శిస్తోంది. ఇంజినీర్ల స్థాయి పోస్టులను మాత్రమే భర్తీ చేస్తూ క్షేత్రస్థాయిలో కీలకమైన సిబ్బంది నియామకాలపై దృష్టి సారించడం లేదు. గత నెలలో ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తిన సమయంలో ఆనకట్టల వద్ద తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంజినీర్లే గేట్ల ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ల అవతారమెత్తాల్సి వచ్చింది. 5,200 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం కాగా.. 4,200కు పైగా పోస్టులు ఖాళీగా ఉండటం దీనికి కారణం.
రెండేళ్ల క్రితమే నివేదించినా..
నీటిపారుదల శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను రెండేళ్ల క్రితమే గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. గ్రామ రెవెన్యూ సహాయకులను(వీఆర్‌ఏ) లస్కర్లు, తత్సమానమైన పోస్టుల్లో తీసుకోవాలని భావించినా ముందడుగు పడలేదు. ఆనకట్టల నిర్వహణకు ప్రధానంగా దిగువ కేడర్ సిబ్బంది అవసరాన్ని ఇటీవల వరదలు చాటిచెప్పాయి. కడెం, వట్టివాగు, కుమురం భీం ప్రాజెక్టుల వద్ద వరదలొచ్చిన సమయంలో పట్టుమని 20 మంది కూడా క్షేత్రస్థాయి సిబ్బంది లేక ఇంజినీర్లు అవస్థలు పడ్డారు. ప్రాజెక్టుల వద్ద పరిస్థితి, చెరువు కట్టల తీరుపై ప్రభుత్వానికి సమాచారం అందించేందుకు ఎవరూ లేరు. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టు కింద తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న లస్కర్లు ఉన్నారు. రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.