ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత ఏడేళ్లలో పోలీస్ శాఖలో పలు సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసింది. పోలీస్ స్టేషన్ల మధ్య ఆరోగ్యకర పోటీ కోసం ఫంక్షనల్ వర్టికల్ విధానాన్ని(functional vertical procedure) అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం 17 వర్టికల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారుడు స్టేషన్‌కు రాగానే సాదరంగా ఆహ్వానించి సమస్యను సావధానంగా వినేందుకు ఠాణాలో రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదుకు అవసరమైన ప్రతి విషయాన్ని ఫిర్యాదులో రాసేలా రిసెప్షన్ కౌంటర్‌లో కూర్చున్న అధికారి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత కేసు నమోదు, దర్యాప్తు, కోర్టులో విచారణ, నిందితుడికి శిక్ష పడేలా చూడటం, స్టేషన్ రైటర్లు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, దొంగతనాల నిఘా, ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, ఫ్రెండ్లీ పోలిసింగ్ ఇలా 17 ఫంక్షనల్ వర్టికల్స్‌ను ఏర్పాటుచేశారు. వాటికి అనుగుణంగా ప్రతి పోలీస్ అధికారి పనిచేయాల్సి ఉంటుంది. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ రిసెప్షన్ కౌంటర్‌లో విధులు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, ఆంగ్లంలో మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు సాయం చేస్తున్న కానిస్టేబుల్ స్నేహ హోంమంత్రి ప్రశంసలందుకుంది.
పనితీరుకే పట్టం
ఫంక్షనల్ వర్టికల్ విధానంలో సిబ్బంది పనితీరును బేరీజు వేసి వారి ప్రతిభను పోల్చుతున్నారు. ఉత్తమంగా ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని ఎఫ్ఐఆర్ నమోదుకు కావాల్సిన విధంగా రాయించారనే విషయాన్ని రిసెప్షనిస్టు విభాగంలో చూస్తారు. అదే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు, క్లూస్ టీం, సీసీ కెమెరాలు ఇలా ప్రతి విభాగంలో పనితీరును చూసి ప్రతిభ కనబరిచిన వాళ్లను జోన్ల వారీగా గుర్తించి ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు. వీటిని పదోన్నతులు, బదిలీల్లోనూ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ విధంగా సిబ్బంది మధ్య స్నేహపూర్వక పోటీ పెంచి నేర నియంత్రణ, కేసుల ఛేదనలో ఉత్తమంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు.
ఉత్తమ పీఎస్‌లు