రాష్ట్రంలో 7,000 మంది వరకు వీఆర్‌ఓలు ఉన్నారు. ఆ వ్యవస్థను తొలగిస్తే వారిని వెంటనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను గుర్తిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖలో ఇటీవల వార్డు ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొత్తగా నియమించుకునే కన్నా ఆ పోస్టుల్లోకి వీఆర్‌ఓలను తీసుకుంటే మేలన్న వాదన వినిపిస్తోంది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వార్డు ఆఫీసర్లుగా దాదాపు 2,000 మంది వరకు సరిపోతారని అంచనా వేస్తున్నారు. రెవెన్యూ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్లుగా కొందరు, పంచాయతీరాజ్ శాఖలో మరికొందరిని సర్దుబాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.
రెవెన్యూ సంఘాలతో సమావేశం!
కొత్త చట్టం, వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు తదితర సంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వం రెవెన్యూ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. సంఘం నాయకులు మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో రెవెన్యూ సంఘాల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడంతో అధికారికంగా తమతో సమావేశం జరిపే అవకాశాలు ఉండొచ్చంటూ ఆయా సంఘాల నేతలు భావిస్తున్నారు.