TS Former CS Somesh Kumar Political Entry: సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ సోమవారం అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు ప్రత్యేక విమానంలో ఔరంగాబాద్ వెళ్లారు. పర్యటన ఆసాంతం కేసీఆర్ వెంట ఉన్న ఆయన.. బహిరంగసభ వేదికపై కూడా ఉన్నారు.
Somesh Kumar Political Entry : కేసీఆర్ తన ప్రసంగంలో సోమేశ్ కుమార్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. తాజా పరిణామం బీఆర్ఎస్, ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. వాస్తవానికి హైకోర్టు ఆదేశాలతో సీఎస్ బాధ్యతలు కోల్పోయినప్పటి నుంచి సోమేశ్ కుమార్ తదుపరి ఏం చేస్తారన్న విషయమై జోరుగా చర్చ జరిగింది. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంటారని.. ఆ తర్వాత తెలంగాణలో సలహాదారుగా లేదా దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగింది.
Somesh Kumar joins BRS party: న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి సోమేశ్ కుమార్ గతంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రిపోర్ట్ చేశారు. అయితే అక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో.. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమోదం కూడా జరిగిందని అన్నారు. ఆ తర్వాత ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్‌లోనే ఉంటూ వ్యక్తిగత పనులు చూసుకుంటున్నట్లు సోమేశ్ కుమార్ చెబుతూ వచ్చారు. తాజాగా ఔరంగాబాద్ పర్యటనతో మరోమారు ఆయన అంశం తెరపైకి వచ్చింది.
Somesh Kumar At Aurangabad BRS meeting : బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ పరిణామాన్ని అనూహ్యంగా అభివర్ణిస్తున్నారు. పార్టీ వర్గాలతో పాటు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. నేరుగా రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లే అయిందని అంటున్నారు. అయితే సోమేశ్ కుమార్ మాత్రం నిర్ధిష్టంగా ఏదీ లేదనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి పిలిచారని, ఆయనతో పాటు తాను ఔరంగాబాద్ వెళ్లానని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఔరంగాబాద్ పర్యటనకు వెళ్లిన కొందరు ముఖ్యనేతలు కూడా సోమేశ్‌ను నేరుగానే ఆరా తీశారు.