రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో పాఠశాలలకు కనీసం 120 పనిదినాలు ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. అది జరగాలంటే కచ్చితంగా బడులను తెరవాలని నిర్ణయించింది. కనీసం 120 రోజులు ప్రత్యక్షంగా తరగతి గది బోధన జరిగితేనే విద్యార్థులు కనీస విద్యా సామర్థా్యలు పొందేలా చేయగలమని, వారికి వార్షిక పరీక్షలు జరపడానికి వీలవుతుందని విద్యాశాఖ యోచిస్తోంది.
ఈ విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్/మే నెలాఖరు వరకు కొనసాగించినా పండగ, ఇతర సెలవులను మినహాయిస్తే 120 రోజుల పనిదినాలు రావాలంటే డిసెంబరులోనే 9, 10 తరగతులతో పాటు ఇంటర్ తరగతులూ మొదలుపెట్టాల్సి ఉంటుందని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమక్షంలో జరిగిన విద్యాశాఖ, ఇతర సంక్షేమ శాఖల అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. కేంద్రం సైతం ఈ విద్యా సంవత్సరాన్ని శూన్య సంవత్సరంగా (జీరో ఇయర్) ఎట్టి పరిస్థితుల్లో చేసేదిలేదని తేల్చిచెప్పిందని, పరీక్షలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరిందని, తాము కూడా పంపామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డిసెంబరులో తెరవాలని అధికారులు విద్యాశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించనున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి ఆమోదానికి దస్త్రం వెళ్తుంది. పాఠశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చే ముందు వైద్యశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది పిల్లలు ఉన్నారని, వారిలో సగం మంది వస్తారని అంచనా వేసినా అంతమందికి కరోనా పరీక్షలు చేయడం కుదిరే పని కాదని ఓ అధికారి స్పష్టంచేశారు.