TS Cabinet Meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. శాసనసభ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. విపక్షాలను దీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.
వజ్రోత్సవాల నిర్వహణ..: రాష్ట్రానికి నిధులు, విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్‌లో ఈ విషయంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభలోనూ ఇందుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ సీబీఐకి అనుమతి ఉండరాదని ఇటీవల బిహార్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రస్తుతం సీఎం ప్రతిపాదిస్తున్న జాతీయ రైతు ఐక్య సంఘటనను అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఈ విషయమై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు..!: జాతీయ రైతు సంఘాల సమావేశ నిర్ణయాలు, తీర్మానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాల్సి ఉన్న తరుణంలో అందుకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో చేసిన భూ కేటాయింపులకు ఆమోదంతో పాటు మలక్‌పేటలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ స్థలాన్ని ఐటీ హబ్‌కు కేటాయించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. నీటి పారుదల ప్రాజెక్టులకు కొన్ని ప్రాజెక్టుల అంచనాలు, సాంకేతిక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక మండలి కోసం చట్ట సవరణ బిల్లు కూడా కేబినెట్ ముందుకు రానుంది. దళితబంధు పథకం అమలు పురోగతిపై కూడా కేబినెట్ సమీక్షించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులతో పాటు మునుగోడు ఉపఎన్నిక కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.