తెలంగాణ

telangana

ETV Bharat / state

'జూన్‌ నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే పూర్తవ్వాలి'

లాక్​డౌన్ ముగిసిన అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ నెలాఖరులోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్​వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టీల్, సిమెంటు కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు.

ఏపీ సీఎం జగన్​

By

Published : Apr 29, 2020, 11:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను జూన్‌ నెలాఖరుకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డిజైన్ల అప్రూవల్స్‌ వీలైనంత త్వరగా తెప్పించాలని... ప్రతి పనికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని పోలవరంపై జరిగిన సమీక్షలో సూచించారు. త్వరలో లాక్​డౌన్ నుంచి మినహాయింపు వచ్చే అవకాశం ఉండటంతో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే అంశంపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.

లాక్‌డౌన్ దృష్ట్యా సిమెంటు, స్టీల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీఎంకు తెలిపిన అధికారులు.. కరోనా వల్ల నెలకుపైగా సమయం కోల్పోయామని తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని... ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్‌ సరఫరా మొదలవుతోందని వివరించారు. పోలవరం ద్వారా ముంపునకు గురయ్యే ప్రతి కుటుంబాన్నీ ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. టన్నెల్‌ 2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపై సమీక్షించిన సీఎం జగన్... నిర్దేశించుకున్న కాలంలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 2020లో ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు.

ఇదీ చదవండి:ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details