ముఖ్యమంత్రి కేసీఆర్(telangana cm kcr), తెరాస(trs) పార్టీపై విపక్షాల విమర్శలపై మంత్రి కేటీఆర్(ktr) ఘాటుగా స్పందించారు. విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక సహించేది లేదని.. దీటుగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ చెప్పారు. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా కొందరు సీఎం కేసీఆర్ ముందు వ్యవహరిస్తున్నారని విపక్షాలను విమర్శిచారు. పేరుకు దిల్లీ పార్టీలైనా.. సిల్లీ పనులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకపోతే టీ కాంగ్రెస్(t congress), టీ భాజపా(t bjp) ఉండేవికావన్నారు. అన్ని పార్టీలు, నాయకుల చరిత్రలు ప్రజలకు తెలుసునన్నారు. హైదరాబాద్ జలవిహార్‌లో జరిగిన తెరాస విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... పేదల ఆశీర్వాదం ఉన్నంతకాలం తెరాసను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
త్వరలో నామినేటెడ్ పోస్టులు
త్వరలో సుమారు 500 నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయని.. కష్టపడే పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర పార్టీ కార్యాలయం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో 150 డివిజన్ కమిటీలతో పాటు... 4,800 కాలనీలు, 1,486 బస్తీల్లో పార్టీ కమిటీలు ఉంటాయన్నారు. ప్రతీ డివిజన్‌కు సోషల్ మీడియా(social media) కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కమిటీల్లో సుమారు లక్ష మంది కార్యకర్తలకు నాయకత్వం వహించే అవకాశం రాబోతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్(ghmc) కమిటీ ఏర్పాటు చేయాలా? లేక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌కు వేర్వేరు? చేయాలా? అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈనెల 20లోగా కమిటీల నిర్మాణం పూర్తి కావాలని.. దీపావళి(deepavali) తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయని కేటీఆర్ వివరించారు.
తెరాస(TRS) అంటే తిరుగులేని రాజకీయ శక్తి. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా మేం ముందుకెళ్తున్నాం. పేదల ఆశీర్వాదం ఉన్నంతకాలం తెరాసను ఎవరూ ఏమీ చేయలేరు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్... త్యాగాల పునాదుల మీదనే ఉద్యమాన్ని చేపట్టారు. గతంలో తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది పోరాడినా... ఎవరూ సాధించలేకపోయారు. కేసీఆర్ వల్లనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోంది. 4.7 లక్షల మంది విద్యార్థులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. కేసీఆర్ కిట్(KCR KIT) రూపంలో బాలింతలకు ఆసరాగా ఉంటున్నాం. సన్నబియ్యంతో నాణ్యమైన అన్నం పెడుతున్న రాష్ట్రం మనదే. హైదరాబాద్‌లో ఏడేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.
-కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు