వరి వద్దనేది కేంద్రం విధానమైతే.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడితో క్షమాపణలు చెప్పించాలి
ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాజ్యంగబద్ధమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పించుకోకుండా, రాష్ట్రంలో యాసంగిలో పండే వరి కొనుగోలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. యాసంగిలో వరి పండించవద్దు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని నిష్కర్షగా చెబుతూ కేంద్రం తాఖీదులిచ్చింది. మరోవైపు రాష్ట్ర భాజపా మాత్రం వరే పండించండంటూ లక్షలాది మంది రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర భాజపా ఒక మాట, రాష్ట్ర భాజపా మరో మాట చెబితే రైతులు ఎవరిని నమ్మాలి. ఎవరిని అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వరి పండించొద్దు అనేదే కేంద్రం విధానమైతే.. భాజపా రాష్ట్ర భాజపా అధ్యక్షుడి (state bjp president bandi sanjay) చెంపలు వాయించండి. రైతాంగానికి క్షమాపణలు చెప్పించండి. రైతాంగానికి ద్రోహం చేయవద్దని బుద్ధి చెప్పండి. ఒకవేళ వరి కొనుగోలు చేస్తామంటే.. మే సహకరిస్తాం.. ఈ అయోమయానికి తెర దించి రాష్ట్ర రైతాంగం తరఫున ధన్యవాదాలు కూడా చెబుతాం.
భాజపాది మంట పెట్టి చలికాచుకునే చిల్లర ప్రయత్నం
రాష్ట్ర రైతాంగంలో ఎలాంటి అయోమయం లేదు. రైతులకు చాలా స్పష్టత ఉంది. దిల్లీ భాజపా ఒక మాట, గల్లీ భాజపా మరో మాట చెబుతాం, సిల్లీగా ప్రవర్తిస్తామంటే రైతులు అమాయకులు కాదు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచిన సత్తా రాష్ట్ర రైతాంగానికి ఉంది. రాష్ట్రంలో నీటి వనరులు, 24 గంటల విద్యుత్, పెట్టుబడి, బీమా, ధీమా ఇచ్చి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాం. రైతుల్లో ఎలాంటి అయోమయం లేదు. భాజపా... రైతులను రెచ్చగొట్టి ధర్నాలు (dharana), రాస్తారోకోలు చేసే దుస్థితి కల్పించి, శాంతిభద్రతల సమస్యలు సృష్టించి.. మంట పెట్టి చలి కాచుకునే చిల్లర రాజకీయ ప్రయత్నం చేస్తోంది.
రైతాంగాన్ని ఏకం చేస్తాం.. భాజపా దుర్నీతిని ఎండగడతాం..
కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే వరకు వదిలి పెట్టం. వరి ధాన్యం నుంచి ప్రత్యామ్నాయం వైపు మళ్లాలని కేంద్రం లేఖ రాసింది. రాష్ట్రంలో అరవై, డెబ్భై లక్షల ఎకరాల్లో పండే పంటను స్విచాఫ్, స్విచాన్ లాగా చేస్తామంటే కుదరదు. ఒకేసారి వరి బంద్ అంటే కుదరదు. ఇదేమి నియంతృత్వం కాదు. దశలవారీగా కార్యక్రమం చేపట్టాలి. రైతులను సముదాయించి విషయం వివరించాలి. భాజపా నేతలు యూపీ, దిల్లీలో జీపుల కింద రైతులను తొక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోతే రాష్ట్ర రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల కింద భాజపాను తొక్కేస్తారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి స్పష్టతనిచ్చే వరకు పోరాటం ఆగదు. మా రైతాంగం వడ్లు కొనుగోళ్లపై తేల్చే వరకు ఆగదు. సీఎం, మంత్రులందరం దిల్లీ వెళ్తాం. గల్లీ నుంచి దిల్లీ వరకు ఉద్యమం కొనసాగుతుంది. రైతాంగాన్ని ఏకం చేస్తాం, భాజపా దుర్నీతిని బయటపెడతాం.