తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్​

రాష్ట్రానికి కేంద్రం చేసింది గుండు సున్నా అని, చట్టప్రకారం దక్కాల్సిన నిధులకన్నా, ఇతర రాష్ట్రాల కంటే అదనంగా, ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు.

కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్​
కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్​

By

Published : Jan 18, 2020, 6:02 AM IST

Updated : Jan 18, 2020, 8:42 AM IST

రాష్ట్రానికి కేంద్రం చేసింది గుండు సున్నా అని, చట్టప్రకారం దక్కాల్సిన నిధులకన్నా, ఇతర రాష్ట్రాల కంటే అదనంగా, ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు తెలిపారు. గత ఐదున్నరేళ్లలో రాష్ట్రంంలోని పట్టణాలకు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక నిధుల వివరాలను ప్రజల ముందుపెట్టాలని భాజపాకు ఆయన సవాలు విసిరారు. తాను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదని, మంత్రులతో మీడియా వాళ్లే మాట్లాడిస్తున్నారన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌, భాజపాలు ఈ ఎన్నికల్లో వందల స్థానాల్లో అభ్యర్థులను నిలపకుండా తెరాస తిరుగుబాటు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే దుస్థితికి చేరాయన్నారు. పైకి ప్రజల ముందు నాటకాలాడుతూ అనైతికంగా లోపాయికారి పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. విపక్షాలు ఎంతగా గింజుకున్నా కేసీఆర్‌పై ప్రజలకు అపార నమ్మకం ఉందని, ప్రతి ఎన్నికలోనూ ఇది తేలిందన్నారు. పురపాలక ఎన్నికల్లోనూ అదే తీర్పు వస్తుందన్నారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం కేటీఆర్‌ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘తెరాస పాలనలో పట్టణాలు ప్రగతి పథంలో పరుగులు తీశాయన్నారు.

ప్రతిపక్షాలు చూడలేని స్థితిలో ఉన్నాయి:

ప్రతిపక్షాలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడలేని స్థితిలో ఉన్నాయి. గత ఐదేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేసిన తెరాసపై ఛార్జిషీటు అంటూ భాజపా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, గత ఆరేళ్లుగా భాజపా తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదు. దశాబ్దాలుగా దగా చేస్తున్న ఈ రెండు పార్టీలపై ప్రజలే ఛార్జిషీటు వేస్తారు. మేం చేసిన అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడుగుతున్నాం. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం ఉంది. 3,148 మందికి టికెట్లు ఇచ్చాం. అవి దక్కని వారి నుంచి అసంతృప్తి సహజం. కొల్లాపూర్‌ సహా అంతటా సమన్వయం చేశాం. టికెట్ల కేటాయింపుపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గెలుపు కోసమే ఐక్యంగా తెరాస శ్రేణులు పనిచేస్తున్నాయి. టికెట్‌ రాలేదని.. మా మంత్రి అమ్ముకున్నారని విమర్శలు చేశారు. వాటిని పట్టించుకోనవసరం లేదు. మిగిలిన ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో మజ్లిస్‌తో మాకు ఎలాంటి పొత్తు లేదు. దీనిపై భాజపా దుష్ప్రచారం చేస్తోంది. భైంసాలో మూడు వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఎన్నిక కావడం స్థానిక కారణాల వల్లే జరిగింది. పురపాలక ఎన్నికల్లో మత పరమైన,జాతీయ అంశాలు పని చేయవు. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఓటర్లను ప్రభావితం చేస్తాయని కేటీఆర్​ పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీలో పాలనను వికేంద్రీకరించాలి...

జీహెచ్‌ఎంసీలో పాలనను వికేంద్రీకరించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. దాని విభజన ఆలోచన ఇప్పట్లో లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు గడువు ప్రకారమే జరుగుతాయి. అక్కడా మేమే గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు

పీఆర్‌సీ నివేదిక వచ్చాక నిర్ణయం...

ఆర్థికభారం ఉన్న నిర్ణయాలను అగమాగంగా తీసుకోలేమని కేటీఆర్​ తెలిపారు. మాంద్యం ప్రభావం ఉన్నందున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తమది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం. వారి పీఆర్‌సీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు.

పాలనా వికేంద్రీకరణ మా విధానం. కొత్త జిల్లాలు, మండలాలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను ఏర్పాటు చేశాం. ఏపీలో రాజధాని మార్చుతామంటే ఆందోళనలు జరుగుతున్నాయి. తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన జరిగింది. అది కేసీఆర్‌ నాయకత్వం వల్లే సాధ్యమైంది. జనసేన అంతర్జాతీయ పార్టీ అయినా మాకు సంబంధం లేదన్నారు.

దేశంలో ఎన్ని పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చారో భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పాలిని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. ఏ అమృత్‌ పట్టణంలో అమృతం పారుతుందో తెలపాలి.. ఎక్కడైనా స్మార్ట్‌ సిటీని నిర్మిస్తే ప్రజలకు చూపాలన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం నిర్మించిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం మాదిరిగా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కట్టారో లేదో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. ఆయన ముందుకొస్తే ఎర్ర తివాచీ వేసి తమ ప్రభుత్వం కొల్లూరులో నిర్మిస్తున్న ఇళ్లను చూపిస్తామని తెలిపారు.

‘కాంగ్రెస్‌ విజన్‌ డాక్యుమెంటులో విజన్‌ ఏమాత్రం లేదని కేటీఆర్​ తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న వాటిని హమీలుగా చెప్పడం హాస్యాస్పదం. బస్తీ దవాఖానాలు, ఏకగవాక్షం, రూ. 5 భోజనం బాగా నడుస్తున్నాయి. జానారెడ్డి భోజనం చేసి మెచ్చుకున్నారు. కనీసం మరో నాలుగేళ్లు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేని పార్టీ హమీలను ఎలా అమలు చేస్తుందో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి. తాము ఎప్పడికీ అధికారంలోకి రాలేమని తెలిసే అసత్య, అమలు చేయలేని హమీలిస్తున్నారని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.

- విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ కేటీఆర్‌

ఇవీ చూడండి: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

Last Updated : Jan 18, 2020, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details