హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో.. ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడినప్పటికీ..ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు. 2016నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో..99 గెల్చుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తెరాస...ఈసారి 55 సీట్లకే పరిమితమైంది. తెరాస ఆధిక్యంలో ఉన్న నేరేడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్రకాకుండా..ఇతర ముద్ర ఉన్న ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఫలితాన్ని నిలిపివేశారు. గత ఎన్నికల్లో 4 డివిజన్లు మాత్రమే గెల్చిన భాజపా..ఈసారి తన బలాన్ని భారీగా పెంచుకుంది. ఆ పార్టీ ఏకంగా...48 డివిజన్లలో జయభేరి మోగించింది. ఎంఐఎం గతంలో గెల్చుకున్న 44 డివిజన్ల సంఖ్యను ఈసారి కూడా సాధించుకుంది. కాంగ్రెస్ పరిస్థితి ఈ ఐదేళ్లలో ఏమాత్రం మారలేదు. ఈసారి కూడా.. 2 స్థానాలకే పరిమితమైంది. తెలుగుదేశం, వామపక్షాలు కూడా పోటీచేసినప్పటికీ డిపాజిట్లు దక్కించుకోలేకపోయాయి.
మొత్తం 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సాధారణ మెజార్టీ 76 కాగా...మ్యాజిక్ మార్కును ఏ పార్టీ అందుకోలేదు. 55 స్థానాలతో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్ల మద్దతుతోనూ.... పీఠం దక్కించుకోవడం తెరాసకు కష్టంగానే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ చట్టప్రకారం కార్పొరేషన్ పరిధిలోని... లోక్ సభ, శాసనసభ, మండలి సభ్యులతో పాటు.. ఓటర్లుగా నమోదు చేసుకున్న రాజ్యసభ, ఇతర ఎమ్మెల్సీలు కూడా... ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తెరాసకు 31 మంది, మజ్లిస్ కు పది..., భాజపాకు ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ.... ఆయన బోడుప్పల్ మున్సిపాలిటీలో ఓటు వేసినందున... ఇక్కడ అవకాశం ఉండదు.