మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు... ఎవరిని వరించునో పీఠం! ఫిబ్రవరి 11న మేయర్, ఉపమేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడం వల్ల తెరాస కార్పొరేటర్లలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. జీహెచ్ఎంసీలో 56 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉన్న తెరాసకు రెండు పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తుండటం వల్ల ఆ పార్టీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆశావహుల పోటీ...
మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడం వల్ల ఆశావహుల పోటీ ఎక్కువగానే ఉంది. తెరాస తరఫున 27 మంది మహిళలు ఎన్నికయ్యారు. వీరిలో ప్రధానంగా ఏడెనిమిది మంది మేయర్ స్థానానికి ప్రధానంగా రేసులో ఉన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని భారతీనగర్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధు ఆదర్శ్ రెడ్డి పేరు ఎక్కవగా ప్రచారంలోకి వచ్చింది.
రేసులో పలువురు...
ఖైరతాబాద్ కార్పొరేటర్, మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి కూడా మేయర్ పదవి ఆశిస్తున్నారు. చర్లపల్లి నుంచి ఎన్నికైన ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి కూడా రేసులో ఉన్నారు. బంజారాహిల్స్ నుంచి మరోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన తెరాస సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి... అల్వాల్ నుంచి మరోసారి గెలిచిన దివంగత ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి ప్రయత్నాల్లో ఉన్నారు.
విస్తృతంగా ప్రచారం...
తార్నాక నుంచి గెలిచిన తెరాస సీనియర్ నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న మోతె శోభన్ రెడ్డి భార్య మోతె శ్రీలత, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్‌గా ఎన్నికైన పార్టీ సీనియర్ నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య కవిత పేర్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి.
ఓసీ వర్గానికే!
జనరల్‌కు రిజర్వ్ అయినందున ఓసీ వర్గాలకే మేయర్ స్థానం దక్కవచ్చునని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. మేయర్ స్థానం జవరల్ మహిళ కాబట్టి.. డిప్యూటీ మేయర్ మైనారిటీ లేదా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన పురుషులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.