TRS with CPM,CPI మునుగోడు ఉపఎన్నికలో కలిసి పనిచేసిన తెరాస- సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్రకార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్‌రెడ్డితో భేటీ అయిన ఎంఎల్‌సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేంద్రంపై పోరాడేందుకు ఇరుపార్టీలు ఉమ్మడి కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నెల 12న రాష్ట్రానికి ప్రధాని రాక దృష్ట్యా.... చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
అనంతరం... ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్డి... ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించున్నట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. మునుగోడు గెలుపుతో తెలంగాణాను పెద్ద విపత్తు నుంచి కాపాడామని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
'మునుగోడులో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తెరాస విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం.' -జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి
'రాష్ట్రాన్ని పెద్ద విపత్తు నుంచి కాపాడమని సంతోషంగా ఉంది. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భాజపా భావిస్తోంది. భాజపాకు అసలు తెలంగాణలో బలం లేదు.'- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి